తెలంగాణ ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇళ్లను మంజూరు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా కొందరికి ఇళ్ల స్థలం కేటాయింపు పత్రాలను అందించారు. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. “జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ”లో సభ్యులుగా ఉన్న జర్నలిస్టులకు పత్రాలను అందజేశారు. అయితే.. ప్రబుత్వం ప్రకటించిన ఈ జాబితాలో వైసీపీ ఏపీ నాయకుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేరు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇళ్ల స్థలాలకు అర్హులైన జర్నలిస్టుల జాబితాను సర్కారు విడుదల చేసింది. ఈ జాబితాలో కన్నబాబు పేరు ఉండడం సంచలనంగా మారింది. నెంబరు 280 దగ్గర “కురసాల కన్నబాబు-చీఫ్ రిపోర్టర్” అని ఉండడం గమనార్హం. దీంతో అసలు ఈ జాబితా ఎప్పుడు తయారు చేశారు? ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? అనేది చర్చనీయాంశం అయింది. ఇది కనుక నిజమే అయితే.. జాబితా మొత్తం లోపభూయిష్ట మేనని పలువురు జర్నలిస్టులు వాపోతున్నారు. అనర్హులకు అవకాశం ఇచ్చినట్టేనని చెబుతున్నారు.
కురసాల కన్నాబాబు గతంలో ఓ ప్రధాన పత్రికలో పనిచేశారు. అయితే.. ఇది 2005కు ముందు ముచ్చట. ఆ తర్వాత.. ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఇటీవల కాలంలో కూడా ఈ విషయాలు చర్చనీయాంశం అయ్యాయి. అప్పట్లోనే తాను ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టానని కూడా చెప్పుకొచ్చారు. ఇక, 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన ఆయన 2014లోవైసీపీ తరఫున పోటీ చేశారు. 2019లో కాకినాడ రూరల్ నుంచి విజయం దక్కించుకుని మంత్రి కూడా అయ్యారు.
మరి దాదాపు 20 ఏళ్లుగా అసలు జర్నలిజం వృత్తిలోనే లేని కురసాల కన్నబాబుకు ఇప్పుడు ఇంటి స్థలం కేటాయించడం ఏంటి ? అసలు ఆయనకు అక్రిడిటేషన్ ఎలా వచ్చింది? వచ్చినా.. ఆయన ఏపీకి చెందిన వారు కాబట్టి.. ఎలా అంగీకరించారు? అసలు జాబితాను సరిచూసుకున్నారా? లేదా? ఇలా.. అనేక సందేహాలు ఇప్పుడు తెరమీదికి వచ్చాయి. ఇదే కనుక నిజమై.. కురసాల కన్నబాబుకు కనుక జర్నలిస్టు కోటాలో ఇంటి స్థలం కేటాయించి ఉంటే.. పెను వివాదమే చెలరేగే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.