ఏపీ సీఎం చంద్రబాబు తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన కార్యాలయానికే పరిమితం కాకుండా.. సమీక్షలు.. సూచనలతోనే సరిపుచ్చకుండా.. కార్యరంగంలోకి దిగారు. పోటెత్తిన వరదలతో విజయవాడ నగర శివారు ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది.

దాదాపు 24 గంటలకు పైగానే ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకుపోయారు. కనీసం తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం కూడా లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో వారి అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. దీంతో సీఎం చంద్రబాబు హుటాహుటిన స్పందించారు. తానే స్వయంగా మంత్రి నారాయణతో కలిసి కార్యరంగంలోకి దిగారు.
బాధిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ శాఖకు చెందిన పడవలలో బయలు దేరి సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ముందుకు సాగారు. రోడ్లకు ఇరు వైపులా దీనంగా ఉన్న వరద బాధితులను ఆయన పలకరించారు. ప్రతి ఒక్కరినీ పలకరించారు. వరద నీటిలోనే మరపడవలను బాధితులకు దగ్గరగా తీసుకువెళ్లి పలకరించారు.
అంతేకాదు.. అక్కడికక్కడే వారిని ఓదారుస్తూ.. భరోసా కల్పించారు. నేనున్నానంటూ.. వారికి ధైర్యం చెప్పారు. వాస్తవానికి ముఖ్యమంత్రిగా.. చంద్రబాబు కాలు కదప కుండా వ్యవహరించే అవకాశం ఉంది. ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచో.. లేక.. సచివాలయం నుంచో ఆయన పనిచేయొచ్చు.
కానీ, బాధితులను నేరుగా కలుసుకుని.. వారికి ఓదార్పు వచనాలు చెప్పడంతోపాటు… వారి బాధను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. గతంలోనూ వరదలు వచ్చాయి. తుఫాన్లు వచ్చాయి. కానీ, అప్పటి ముఖ్యమంత్రి కేవలం క్యాంపు కార్యాలయం నుంచి సమీక్షించి..వదిలేశారు. వరదలు తగ్గాక.. వెళ్లి పరామర్శించారు.
దీనివల్ల బాధితులకు మనో వేదన చెప్పుకొనేందుకు.. స్వయంగా ముఖ్యమంత్రి తెలుసుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. కానీ, దీనికి భిన్నంగా చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగడం.. బాధితులకు ఓదార్పు ఇవ్వడంతో వారికి మానసికంగా అయినా.. ధైర్యం కల్పించే అవకాశం ఏర్పడింది.
కాగా, ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరదల కారణంగా.. ఏపీలో చాలా జిల్లాలు జలదిగ్భంలో చిక్కుకున్నాయి. విజయవాడ, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు జలమయం అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో కలెక్టర్లు, మంత్రులు పర్యటిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates