సోము కాపు జ‌పం.. ఆ రెండు జిల్లాల‌పై ఫోక‌స్‌

గ‌తానికి భిన్నంగా రాష్ట్ర బీజేపీ అడుగులు వేస్తోందా? ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌.. ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌నే ఏకైక ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారా? ఈ క్ర‌మంలో వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. రాష్ట్రంలోని ప‌ద‌మూడు జిల్లాల్లోనూ ఒక జిల్లాకు మ‌రో జిల్లాకు మ‌ధ్య పోలిక‌లు లేవు. ఒక జిల్లాలో ఉన్న స‌మ‌స్య‌లు మ‌రో జిల్లాలో పెద్ద‌గా క‌నిపించ‌వు. సో.. ఈ నాడిని ప‌ట్టుకున్న సోము.. త‌న‌కు, పార్టీకి సానుకూలంగా ఉన్న వ్యూహాల‌ను అమ‌లు చేసేందుకు ముందుకు సాగుతున్నార‌ని తెలుస్తోంది.

కృష్ణా, గుంటూరు జిల్లాల‌ను ఆయ‌న దాదాపు ప‌క్క‌న పెట్టారు. ఇక్క‌డ అమ‌రావ‌తి రాజ‌ధాని ఎఫెక్ట్ క‌నిపిస్తోంది. దీనిపై ఎటూ మాట్లాడే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. సో.. ఈ విష‌యాన్ని అన‌వ‌స‌రంగా కెలికి.. పార్టీని ప‌ల‌చ‌న చేసుకోవ‌డం ఎందుక‌నే ధోర‌ణిలో ఈ రెండు జిల్లాల‌పై ఫోక‌స్ త‌గ్గించారు. అదేస‌మ‌యంలో కీల‌క‌మైన మ‌రో రెండు జిల్లాల‌పై ఆయ‌న సామాజిక వ‌ర్గం కోణంలో ఫోక‌స్ చేస్తున్నారు. తాను కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతో తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో.. ఎక్కువ‌గా ఉన్న, కీల‌క‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న కాపుల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే రెండు జిల్లాల్లో ఆర్థికంగా, అనుచ‌ర‌గ‌ణం ప‌రంగా కూడా బాగున్న‌వారికి పార్టీలో కీల‌క ప‌ద‌వులు ఇస్తామ‌ని, వ‌చ్చేది మ‌న ప్ర‌భుత్వ‌మేన‌ని, బీజేపీ-జ‌నసేన‌ల కూట‌మే రాష్ట్రంలో 2024లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంద‌ని, సో.. పార్టీలోకి రండి! అని ఆయ‌న తెర‌చాటుగా కొంద‌రి ద్వారా వ‌ర్త‌మానాలు పంపుతున్నారు. ఈ క్ర‌మంలో ఒక విష‌యం బ‌లంగా ప‌నిచేస్తోంది. సోము మాట‌కు క‌ట్టుబ‌డే మ‌నిషి.. ప‌దేప‌దే వ్యూహాలు మార్చ‌డం, కేంద్రంలోని పెద్ద‌ల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌క‌పోవ‌డం వంటివి కాపు నేత‌ల‌ను కూడా ఆకర్షిస్తున్నాయి.

అయితే.. పార్టీలో చేర‌డంపై మాత్రం కొంత వ‌ర‌కు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సోము చెబుతున్న‌ట్టుగా పార్టీకి అధికారంలోకి వ‌చ్చే సీన్ ఉందా? అనేది వీరి ప్ర‌ధాన అనుమానం. ఈ విష‌యంలో సోము క్లారిటీగా ఉంటే.. కాపు స‌మాజం మొత్తం ఆయ‌న‌వైపు ఉండే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు కూడా అంచ‌నా వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.