హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ లో అక్రమ నిర్మాణదారులను, అందరు రాజకీయ నాయకులను వణికిస్తున్న సంస్థ. చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను గుర్తించి తొలగించేందుకు ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు చాలా కట్టడాలు కూల్చివేసింది. ఇక నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన నేపథ్యంలో అది పెద్ద చర్చకు దారితీసింది.
ఏకంగా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు దుర్గం చెరువులో, మంత్రి పొంగులేటి ఇల్లు హిమాయత్ సాగర్ లో, ఎమ్మెల్యే వివేక్ తదితరుల నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని కూల్చకుండా ఎన్ కన్వెన్సన్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేలమట్టం చేయడం విమర్శలకు దారితీసింది.
అయితే హైడ్రా కూల్చివేతల విషయంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న విధానం ఆపార్టీ కార్యకర్తలను గందరగోళ పరుస్తున్నది. నాగార్జున్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను ఎంపీ రఘునందన్ రావు పూర్తిగా సమర్ధించాడు. రాజాసింగ్ ఓ అడుగు ముందుకు వేసి ఓవైసీలకు చెందిన కాలేజీని కూల్చేయాలని, తాను దగ్గరుండి సహకరిస్తానని ప్రకటించాడు.
అయితే ఎంపీ ఈటెల రాజేందర్ సామాన్యులకు హైడ్రా నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపడుతూ నోటీసులు వచ్చిన వారిని కలిసి వారికి అండగా ఉంటానని భరోసా ఇస్తున్నాడు. కేంద్రమంత్రి బండి సంజయ్ హైడ్రా అనేది బ్లాక్ మెయిలింగ్ కోసం ఏర్పాటు చేసిన సంస్థ అంటూ విమర్శలు గుప్పించగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగేందుకే దీనిని ఏర్పాటు చేశారని ఎంపీ డీకె అరుణ ఆరోపించారు.
మరో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హైడ్రాను సమర్ధించగా బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి నేరుగా హైడ్రా కమీషనర్ రంగనాథ్ మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బీజేపీకి హైడ్రా విషయంలో క్లారిటీ లేకపోవడం మూలంగా గందరగోళంగా పరిస్థితి తయారయిందని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.