ఏపీలో జరుగుతున్న ఘటనలపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల వెంటనే స్పందిస్తున్నారు. నిజానికి 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్న జగన్ వెంటనే రియాక్ట్ అవ్వాలి. కానీ, తాడేపల్లి ప్యాలెస్ గడప దాటి రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పోనీ.. ట్విట్టర్‌లో అయినా.. స్పందిస్తున్నారా? అంటే.. ప్రజలు తనను గెలిపించలేదన్న ఆవేదన నుంచి ఆయన ఇంకా కోలుకున్నట్టు లేరు. అందుకే చాలా నిదానంగా.. రియాక్ట్ అవుతున్నారు. కానీ, షర్మిల మాత్రం ప్రజాప్రతినిధులు ఉన్నా.. లేకున్నా రియాక్ట్ అవుతున్నారు.
తాజాగా వెలుగు చూసిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ సంచలన ఘటన పై వెంటనే స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ప్రజాప్రతినిధి కుమార్తె ఈ కేసులో ఉన్నారన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎవరున్నా కూడా.. వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఆడబిడ్డకు తల్లిగా తాను ఈ విషయం తెలిసి, దిగ్భ్రాంతికి గురయ్యానని షర్మిల వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ ఘటనపై విచారణ పేరులో రోజులు గడిపేస్తే కుదరదని కూడా తేల్చి చెప్పారు.
వచ్చే వారంలో ఈ కేసులో బాధ్యులను అరెస్టు చేయకపోతే.. తానే నేరుగా రంగంలోకి దిగుతానని కూడా ఆమె హెచ్చరించారు. నిరసన చేపడతానని.. బాధిత విద్యార్థినుల తరఫున పోరాటం చేస్తానని చెప్పారు. ఇలా.. షర్మిల ఎక్కడ ఘటన జరిగినా వెంటనే రియాక్ట్ అవుతున్నారు. గతంలోనూ మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగు చూసినప్పుడు కూడా.. ఆమె స్పందించారు. అంతేకాదు.. ఇదే కృష్ణాజిల్లాలోని ఓ 10వ తరగతి విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం(అదే పాఠశాల విద్యార్థులు నిందితులు)పై షర్మిల స్పందించాక.. విషయం వెలుగు చూడడం గమనార్హం. ఏదేమైనా.. జగన్ కంటే షర్మిల మెరగు అనే మాట వినిపిస్తోంది.