ఏపీలోని కూటమి సర్కారులో మంత్రులుగా ఉన్నవారి పనితీరును అంచనా వేస్తున్నామని.. ముఖ్యమం త్రి చంద్రబాబు చెప్పారు. అంతేకాదు.. వారి పనితీరును ఆధారంగా చేసుకుని వారికి ప్రోగ్రెస్ రిపోర్టు ఇస్తామని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
తాజాగా రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమయం లో గత కొన్నాళ్లుగా వివాదంగా మారుతున్న మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయా నాయకుల తీరును చంద్రబాబు ప్రస్తావించారు.
ముఖ్యంగా ఇటీవల కాలంలో తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారిన కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు మంత్రుల కుటుంబ సభ్యుల వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.
ఇలాంటి వారిని కంట్రోల్ చేసుకోవాలని.. లేకపోతే.. తానే రంగంలోకి దిగాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు చేస్తున్న మంచి ని పక్కదారిపట్టించేలా కొందరు వ్యవహరిస్తున్నారని ఆయన ఫైరైనట్టు తెలిసింది. దీనిని ఎవరికి వారు సరిచేసుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.
ఇదిలావుంటే.. వచ్చే నెలతో కూటమి సర్కారుకు 100 రోజుల పాలన పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరు ఎలా ఉంది? ఏయే పనులు చేస్తున్నారు. ప్రజల రేటింగ్ ఎలా ఉంది..? అనే కీలక అంశాలపై వారికే స్వయంగా రిపోర్టు అందించనున్నట్టు చంద్రబాబు తెలిపారు.
దీనిలో కూటమి పార్టీల మంత్రులు కూడా ఉన్నారని చెప్పారు. మరింతగా ప్రజలకు చేరువ కావాల్సి ఉందని.. ప్రభుత్వం తరఫున చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు మరింత వివరించాలని కూడా చంద్రబాబు సూచించినట్టు సమాచారం.