ఏపీపై మోడీ క‌రుణ‌.. నిధులు.. పార్కులు..  కేంద్రాలు!

ఏపీపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌రుణించారు. ప్ర‌స్తుతం ఇటు ఏపీలోనూ.. కేంద్రంలోనూ ఎన్డీయే కూట‌మి స‌ర్కారు ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కేంద్రంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండు నెల‌ల కాలంలోనే మోడీ ప్ర‌భుత్వం ఏపీపై వ‌రాల జ‌ల్లు కురిపించ‌డం ప్రారంభించింది. ఇటీవ‌ల బ‌డ్జట్‌లో అమ‌రావ‌తి నిర్మాణానికి.. రూ.15 వేల కోట్ల మేర‌కు నిధులు స‌మ‌కూరుస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అదేస‌మ‌యంలో పారిశ్రామిక పార్కులు స‌హా ఇత‌ర అంశాల్లోనూ దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకుంటోంది.

తాజాగా బుధ‌వారం జ‌రిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఏపీ జీవ‌నాడి వంటి పోలవరం ప్రాజెక్టు పూర్తికి పెండింగ్ నిధులతో పాటు రూ.12,500 కోట్ల విడుదలకు ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివ‌ల్ల పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌రుగులు పెట్టేందుకు కొంత ఆస్కారం ఉంటుంది. అయితే.. ఇది కొంత వ‌ర‌కే సాయం. ఎందుకంటే.. అస‌లు స‌మ‌స్య పున‌రావాసంతోనే ముడిపడి ఉంటుంది. దీంతో ఇప్పుడు ఇచ్చిన నిధులు కొంత వ‌ర‌కు ప్ర‌యోజ‌న‌మ‌నే చెప్పాలి.

ఇత‌ర నిర్ణ‌యాలు..

+ కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్‌ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేస్తారు.

+ కొప్ప‌ర్తి పారిశ్రామిక హ‌బ్‌కు రూ.2,137 కోట్లు ఖర్చు చేయనున్నారు.

+ కొప్ప‌ర్తి పారిశ్రామిక  హబ్‌తో 54 వేల మందికి ఉపాధి కల్పిస్తారు.

+ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు.

+ దీనిని రూ.2,786 కోట్లతో ఏర్పాటు చేస్తారు.

+ ఓర్వ‌క‌ల్లు పారిశ్రామిక కారిడార్ ద్వారా 45 వేల మందికి ఉపాధి అవకాశాలు ల‌భిస్తాయి.

స‌మాచార విప్ల‌వం..

ఏపీలో స‌మాచార విప్ల‌వానికి కూడా మోడీ స‌ర్కారు పావులు క‌దిపింది. దీనిలో భాగంగా ఎఫ్ ఎం. రేడియో కేంద్రాల‌ను విస్తృతంగా ఏర్పాటు చేయ‌నుంది. మొత్తం 22 నగరాల్లో 68 కొత్త ఎఫ్ఎం రేడియో స్టేషన్లు ఏర్పాటు  చేస్తారు. వీటి ద్వారా.. ఉపాధి, సృజ‌నాత్మ‌క రంగాలు పుంజుకోనున్నాయి.