హ‌రీష్ రావుకు బంప‌రాఫ‌ర్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి

బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే హ‌రీష్‌రావుకు సీఎం రేవంత్ రెడ్డి బంప‌రాఫర్ ప్ర‌క‌టించారు. హైడ్రాపై ఆరోప‌ణ‌లు చేస్తున్న హ‌రీష్‌రావుకు.. ఆయ‌న ప్ర‌త్యేకంగా అవ‌కాశం ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. చెరువులు, నాలాలు, కుంట‌లు ఆక్ర‌మించి.. క‌ట్ట‌డాలు చేశారో లేదో తేలుద్దామ‌ని అన్నారు.  క్ర‌మంలో హ‌రీష్‌రావు నేతృత్వంలోనే హైలెవిల్ క‌మిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఆయ‌న దీనికి అంగీక‌రించాల్సి ఉంటుంద‌న్నారు.

ఈ క‌మిటీ ద్వారా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఆక్ర‌మ‌ణ‌లు నిజ‌మో.. కాదో.. తేల్చే బాధ్య‌త ఆయ‌నే తీసుకోవ‌చ్చని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైడ్రాను వెన‌క్కి తీసుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. అయితే.. జిల్లాల‌కు విస్త‌రించే అవ‌కాశం కూడా లేద‌న్నారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఆక్ర‌మ‌ణ‌ల కార‌ణంగా.. నాలాలు తెరుచ్చుకుని మ‌ర‌ణాలు కూడా సంభ‌విస్తున్నాయ‌ని.. సామాన్యుల క‌ష్టాలు తీర్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ క్ర‌మంలో అవ‌స‌ర‌మైతే.. త‌న ఆస్తులే ఉన్నా.. కూల్చేసేందుకు రెడీ అని రేవంత్ అన్నారు.

హైడ్రా విష‌యంలో త‌న మ‌న అనే తేడా లేద‌న్నారు. త‌మ సొంత పార్టీ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, సెంట్ర‌ల్ వ‌ర్కింగ్ క‌మిటీ నాయ‌కుడు.. ప‌ళ్లం రాజుకు చెందిన భ‌వ‌నాల‌నే కూల్చి వేసిన విష‌యాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. “హైడ్రా సంస్థ‌ను హైద‌రాబాద్ కోసం తీసుకువ‌చ్చాం. దీనికి త‌న మ‌న అనే మాటే ఉండ‌దు. అంద‌రూ స‌మాన‌మే., కేటీఆర్ ఉన్న‌డా.. రేవంత్ రెడ్డి ఉన్న‌డా.. అని హైడ్రా చూడ‌దు. ఆక్ర‌మ‌ణ జ‌రిగిందా?  లేదా? అన్న‌దే హైడ్రా చూస్తుంది” అని రేవంత్ స్ప‌ష్టం చేశారు.

రాబోయే రోజులు హైడ్రా మ‌రింత యాక్టివ్‌గా ప‌నిచేస్తుంద‌న్నారు. న‌గ‌రాన్ని అభివృద్ధి చేయ‌డం అంటే.. ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించాల‌న్న సంక‌ల్పం కూడా దానిలోనే ఉంద‌న్నారు. అంతేకానీ..ఎవ‌రినీ ఇబ్బంది పెట్టాల‌న్న ఉద్దేశం త‌మ‌కు లేద‌న్నారు. ఆక్ర‌మ‌ణ‌లు చేసిన‌ప్పుడు  ఆలోచించుకుని ఉండాల‌న్నారు. 30 ఏళ్ల కింద‌ట జ‌రిగిన ఆక్ర‌మ‌ణ‌ల‌ను కూడా ఇప్పుడు గుర్తించి తొల‌గిస్తామ‌ని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. తాజాగా ఆయ‌న స‌చివాల‌యంలో మీడియాతో మాట్లాడారు.