వైసీపీ కీలక నాయకురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ సభ్యత్వా నికి రాజీనామా చేసిన సునీత.. మండలి కార్యదర్శికి పంపించారు. ఈ రాజీనామా ఆమోదం కోసం వేచి చూస్తున్నట్టు ఆమె తెలిపారు. అయితే.. వైసీపీ సభ్యత్వానికి కూడా పోతుల సునీత రాజీనామా చేయడం గమనార్హం. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన పోతుల.. నేరుగా ఆ పార్టీ అధినేత జగన్‌కు పంపిం చారు. కాగా.. ప్రస్తుతం పోతుల సునీత వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు.
ఎమ్మల్సీ పదవి సహా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా ఆమె ఈ పదవికి కూడా రాజీనామా చేసినట్టయింది. అయితే.. సునీత రాజకీయ ప్రస్థానం చూస్తే.. ఆయారాం.. గయారాం.. అన్నట్టు ఉంటుంది. గతంలో టీడీపీలోనే ఉన్న సునీత.. చీరాల నుంచి 2014లో పోటీ చేశారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన సునీత.. ఫైర్‌బ్రాండ్ నాయకురాలిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అప్పటి ఎన్నికల్లో ఓటమి తర్వాత.. చంద్రబాబు ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు.
అయితే.. తనకు మంత్రిపదవి ఇవ్వాలేదని ఆరోపిస్తూ.. టీడీపీ అదికారం కోల్పోయిన తర్వాత.. సునీత.. వైసీపీలోకి జంప్ చేశారు. అయితే.. అప్పుడు కూడా.. ఆమె తన పదవికి రాజీనామా చేశారు. తిరిగి జగన్ ఆ పదవిని ఆమెకే ఇవ్వడంతోపాటు.. పార్టీలోనూ గౌరవంగానే చూసుకున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటించినప్పుడు కూడా.. పోతుల సునీత వెంటే ఉన్నారు.
అయితే.. ఇక, పార్టీ పుంజుకునే పరిస్థితి కనిపించకపోవడం ఎలా ఉన్నా.. వ్యక్తిగత సమస్యల కారణంగానే పోతుల వైసీపీని వీడినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం. పైగా అదేపదవిని ఆమె సొంతం చేసుకోవడం కూడా ఖాయం. ఇదిలావుంటే.. చీరాలలోను, మంగళగిరిలోనూ చేనేత సామాజిక వర్గాన్ని ఆకర్షించాలన్న వ్యూహంతోనే పొతులకు టీడీపీ రెడ్ కార్పెట్ పరిచినట్టు తెలుస్తోంది.