జైలు నుంచి బ‌య‌ట‌కు.. క‌విత సంచ‌ల‌న ప్ర‌తిజ్ఞ‌

మ‌ద్యం కుంభ‌కోణం కేసులో అరెస్ట‌యి.. దాదాపు 5 నెల‌ల‌కు పైగానే తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత మంగ‌ళ‌వారం రాత్రి 10-11 గంట‌ల మ‌ధ్య‌ స‌మ‌యంలో జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో బీఆర్ ఎస్ నాయ‌కులు హ‌రీష్ రావు, కేటీఆర్ స‌హా క‌విత భ‌ర్త‌, కుమారుడు కూడా అక్క‌డే ఉన్నారు. క‌విత బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకున్నాయి. ట‌పాసులు కాల్చి.. మిఠాయిలు తినిపించి.. జై తెలంగాణ‌, జై క‌విత‌క్క నినాదాల‌తో హోరెత్తించారు.

అనంత‌రం.. క‌విత మాట్లాడుతూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఇప్పుడు జ‌గ‌మొండిగా మారాన‌ని.. త‌న‌ను జైలుకు పంపించిన వారికి వ‌డ్డీతో చెల్లిస్తాన‌ని ఆమె చెప్పారు. అయితే.. ఎవ‌రు ఆమెను జైలుకు పంపించార‌నే విష‌యాన్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు. ఇక‌, తాను మంచి దానినని..అన్యాయంగా అక్ర‌మంగా త‌న‌పై కేసు పెట్టి.. జైల్లోకి నెట్టార‌ని క‌విత చెప్పారు. అయితే.. సౌమ్యంగా ఉండే త‌న‌ను జ‌గ మొండిగా మార్చార‌ని క‌విత చెప్పుకొచ్చారు. ఇప్పుడు మ‌రింత క‌సితో ప‌నిచేసి..త‌న‌ను జైలుకు పంపించిన వారి అంతు చూస్తాన‌ని ప్ర‌తిజ్ఞ చేశారు.

“ప్రజాక్షేత్రంలో ఇంకా గట్టిగా, కమిట్మెంట్ తో పనిచేస్తా. చట్ట ప్రకారం పోరాడతా. నేను కేసీఆర్ కూతుర్ని, తప్పు చేసే ప్రసక్తే లేదు“ అని క‌విత తేల్చి చెప్పారు. త‌మ పార్టీని, త‌మ కుటుంబాన్ని కొంద‌రు ల‌క్ష్యంగా చేసుకుని రాజ‌కీయాల్లో పోరాడే శ‌క్తి లేక‌, ధైర్యం లేక‌.. త‌న‌పై కేసులు పెట్టించార‌ని అన్నారు. తాను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్న క‌విత‌.. ఎన్నో ఎత్తుపల్లాలు చూశానన్నారు.  త‌న‌కు జ‌రిగిన అన్ని అవ‌మానాల‌ను గుర్తు పెట్టుకుంటాన‌ని క‌విత చెప్పారు. వీటికి తప్పకుండా వడ్డీ తో సహా చెల్లిస్తానని ప్ర‌తిజ్ఞ చేశారు. అనంత‌రం.. కుటుంబ స‌భ్యులు, సోద‌రుడితో క‌లిసి ఢిల్లీలోని పార్టీ కార్యాయానికి వెళ్లారు. బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ఎలాంటి ష‌ర‌తులూ.. పెట్ట‌క‌పోవ‌డంతో ఆమె బుధ‌వారం హైద‌రాబాద్‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.