తెలంగాణలో చర్చకుదారి తీసిన హైడ్రా వ్యవహారం.. బీజేపీలో కుమ్ములాటలకు దారి తీస్తోంది. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన ఈ వ్యవస్థపై బీజేపీ నేతలు తలోమాట మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు రేవంత్ సర్కారును విమర్శిస్తూ.. అందరూ ఒకే బాటలో నడిచిన కమలం పార్టీ నాయ కులు హైడ్రా విషయానికి వస్తే.. ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. దీంతో హైడ్రా వ్యవహారం అధికార పార్టీలో ఎలా ఉన్నా.. కమలం పార్టీలో మాత్రం కుమ్ములాటకు దారితీస్తోంది.
సీనియర్ నేత.. ఈటల రాజేందర్.. హైడ్రాను తీవ్రంగా తప్పుబట్టారు. ఎప్పుడో దశాబ్దాల కిందట నిర్మించి న వాటిని అడ్డగోలుగా ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు.. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర, కుతంత్రాలతో సాగుతున్న వ్యవహారమని.. దీనిని అందరూ ఖండించాలని ఆయన చెబుతున్నారు. మరో సీనియర్ నాయకుడు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దీనికి భిన్నంగా మాట్లాడారు. ముందు.. ఎంఐఎం నాయకుల ఆక్రమణలుతొలగించాలని ఆయన పిలుపునిస్తున్నారు.
అంటే.. బండి సంజయ్ హైడ్రాను సమర్థిస్తున్నారనే విషయం స్పష్టమైంది. కానీ, ఆయన ఎంఐఎం నాయ కులను టార్గెట్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇక, తాజాగా రఘునందనరావు మరో సంచలన వ్యాఖ్య చేశారు. ‘‘జెండాలతో సంబంధం లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చాలి” అని ఆయన పిలుపుని చ్చారు. అంటే.. ఈయన కూడా హైడ్రాను స్వాగతిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం చెరువులు, కుంటల ఆక్రమణల కూల్చివేతల క్రమంలో ఎంతటివారైనా వదిలిపెట్టకుండా హైడ్రా పారదర్శకంగా వ్యవహరించాలి.. అని కూడా చెప్పుకొచ్చారు.
అంతేకాదు..కూల్చివేతలకు ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్లను ఎక్కించాలంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. అన్ని పరిణామాలను తాము నిశితంగా గమనిస్తామని.. సమయం వచ్చినప్పుడు మాట్లాడతామని ఆయన చెబుతున్నారు. అంటే.. ఆయన కూడా హైడ్రాకుఅనుకూలంగా ఉన్నారనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఈ పరిణామాలను చూస్తే.. కమలం పార్టీలో నాయకులు భిన్నమైన వాదన వినిపించడం.. ఆ పార్టీలో ఐక్యత కొరవడి కుమ్ములాటలు కొనసాగుతున్నాయని చెప్పడానికి తార్కాణంగా మారిందని పరిశీలకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates