నాగార్జున పై సీపీఐ నారాయ‌ణ ధ్వ‌జం

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత వ్య‌వ‌హారం రెండు రోజులుగా చ‌ర్చ‌నీయాంశం అవుతున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లోని తిమ్మిడిగుంట చెరువు ప‌రిధిలో దీన్ని అక్ర‌మంగా నిర్మించార‌నే కార‌ణంతో ప్ర‌భుత్వం కూల్చివేయ‌గా.. నాగార్జున ఈ చ‌ర్య‌ను తీవ్రంగా ఖండించారు.

చెరువులో ఒక్క సెంట్ భూమిని కూడా ఆక్ర‌మించ‌లేద‌ని.. ప‌ట్టా భూమిలోనే నిర్మాణం జ‌రిగింద‌ని ఆయ‌న అంటున్నారు. ఈ విష‌య‌మై కోర్టుకు వెళ్లి కూల్చివేత‌కు వ్య‌తిరేకంగా స్టే ఆర్డ‌ర్ కూడా తెచ్చుకున్నారు నాగ్. ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత‌ పై సామాజిక మాధ్య‌మాల్లో వాదోప‌వాదాలు న‌డుస్తుండ‌గా.. సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ ఈ ప్రాంతాన్ని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ నాగార్జున‌పై ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

సాధార‌ణంగా చెరువు ఉన్న చోట‌.. చెరువు ప‌రిధి అయిపోయాక కూడా వంద మీట‌ర్ల బ‌ఫ‌ర్ జోన్ ఉంటుంద‌ని.. దాన్ని దాటే నిర్మాణాలు చేప‌ట్టాల‌ని.. కానీ నాగార్జున మాత్రం బ‌ఫ‌ర్ జోన్లో కూడా కాకుండా చెరువులోనే ఎన్ క‌న్వెన్ష‌న్ నిర్మించార‌ని నారాయ‌ణ అన్నారు. నాగార్జున పెద్ద సినిమా స్టార్ కావ‌చ్చ‌ని.. సినిమాల‌తో పాటు బిగ్ బాస్ ద్వారా ఎంతో సంపాదిస్తార‌ని.. కానీ చెరువును ఆక్ర‌మించి క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ క‌ట్టాల్సినంత‌ క‌క్కుర్తి ఆయ‌న‌కు ఎందుకని నారాయ‌ణ ప్ర‌శ్నించారు.

నాగ్ తండ్రి ఆద‌ర్శ‌వంతుడ‌ని.. కానీ నాగ్ మాత్రం త‌ప్పు చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌భుత్వం ఈ క‌ట్ట‌డాన్ని కూల్చివేసి మంచి ప‌ని చేసింద‌ని.. అంత‌టితో ఆగ‌కుండా ప‌దేళ్లుగా ఈ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ద్వారా సంపాదించిన ఆదాయం మొత్తం నాగ్ నుంచి కక్కించాల‌ని.. ఆ డ‌బ్బుతో పేద‌ల‌కు రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ఇళ్లు క‌ట్టించాల‌ని ఆయ‌న సూచించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి మ‌ల్లారెడ్డితో పాటు ఇంకా చాలామంది చెరువుల‌ను ఆక్ర‌మించి అనేక నిర్మాణాలు చేశార‌ని.. వాట‌న్నింటినీ కూల్చేయాల‌ని నారాయ‌ణ డిమాండ్ చేశారు.