వైసీపీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయనపై జిల్లా ఎస్పీ.. నియోజకవర్గ బహిష్కరణ వేటు వేశారు. తాము అనుమతి ఇచ్చే వరకు నియోజకవర్గంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు పెద్దారెడ్డి ఇంటి కి నోటీసులు పంపించారు. నిజానికి ఎన్నికల ఫలితాల తర్వాత.. జరిగిన ఘర్షణల నేపథ్యంలో పెద్దారెడ్డిపై అనధికార వేటు కొనసాగుతోంది.
ఆయనను నగరంలోకి ఒకరకంగా చెప్పాలంటే జిల్లాలోకి కూడా పోలీసులు అనుమతించడం లేదు. అయితే.. ఏదో ఒక కారణంగా పెద్దారెడ్డి మాత్రం నియోజకవర్గంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, పెద్దారెడ్డి వచ్చినప్పుడల్లా.. ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవల నాలుగు రోజుల కిందట కూడా.. పెద్దారెడ్డి నియోజకవర్గంలోకి ఎంట్రీతో తీవ్ర దుమారం రేగింది. ఆయన నియోజకవర్గంలోకి వచ్చాడని తెలుసుకున్న టీడీపీ నాయకులు.. ఆయనను ప్రశ్నించేందుకు ఇంటికి చేరుకున్నారు.
దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు పోగై.. ఇరు పక్షాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. వ్యక్తులకు పెద్దగా గాయాలు కాలేదుకానీ.. ఇరు పక్షాలకు చెందిన వాహనాలు తగులబెట్టుకున్నారు. పెద్దారెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు.. పెద్దారెడ్డిని అక్కడి నుంచి అనంతపురం పట్టణానికి పంపించేశారు. కాగా… ఎన్నికల తర్వాత చెలరేగిన హింస.. అనంతర పరిణామాలపై ఇప్పటికే కేసులు నమోదై.. విచారణ పరిధిలో ఉన్నాయి.
ఇక, ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వానికి డీజీపీ నివేదిక సమర్పించారు. తాడిపత్రిలో ఇరు పక్షాలు.. అంటే.. టీడీపీ, వైసీపీ కీలక నాయకులు ఉంటే ఇలాంటి ఘర్షణలే ఉంటాయని తేల్చి చెప్పారు. దీంతో గెలిచిన జేసీ అస్మిత్ రెడ్డి కుటుంబాన్ని అలానే ఉంచి.. వివాదాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకుడు, పెద్దారెడ్డిని నియోజకవర్గం నుంచి బహిష్కరిస్తూ.. ఎస్పీ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates