నెల‌కు రెండు సార్లు ప్ర‌జ‌ల్లోకి.. చంద్ర‌బాబు స్పెష‌ల్‌

ఏపీలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి 70 రోజుల‌కు పైగానే అయింది. ఈ మ‌ధ్య కాలంలో నెల‌కు రెండు సార్లు సీఎం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు. వారి స‌మ‌స్య‌లు వినేందుకు ప్రాదాన్యం ఇస్తున్నారు. వారికి చేరువ‌గా కూడా ఉంటున్నారు. గ‌తంలో వైసీపీ అధినేత‌, అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ .. నెల‌కు కాదుక‌దా.. ఆరు మాసాల‌కు ఒక్క‌సారి కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రాలేని ప‌రిస్థితిని క‌ల్పించుకున్నారు. వ‌చ్చినా.. నేరుగా ప్ర‌జ‌ల‌తో క‌లిసే ప‌రిస్థితి లేదు. ప‌రాదు, డేరాలు.. క‌ట్టుకునిరావడం.. స‌భ‌ల‌కు వ‌చ్చేవారికి ఆంక్ష‌లు విధించ‌డం అంద‌రికీ తెలిసిందే.

దీంతో సాధార‌ణ ప్ర‌జ‌లు స‌భ‌ల‌కు వ‌చ్చిన ప‌రిస్థితి లేదు. దీంతో ప్ర‌జ‌ల‌కు-జ‌గ‌న్‌కు మ‌ధ్య దూరం పెరిగింది. ఇక‌, చంద్ర‌బాబు విష యానికి వ‌స్తే.. దీనికి భిన్నంగా కార్య‌క్ర‌మాలు రూపొందించుకుంటున్నారు. ఎంతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. నెల‌కు ఖ‌చ్చితంగా రెండు నుంచి మూడు సార్ల‌యినా.. ఏదో ఒక రూపంలో ప్ర‌జ‌ల ముంగిట‌కు వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌డిచిన రెండు మాసాల కాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటే.. చంద్ర‌బాబు రెండేసి సార్లు చొప్పున ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చారు. ప్ర‌తి నెలా 1వ‌ తేదీన ఖ‌చ్చితంగా సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల పంపిణీ పేరుతో ఆయ‌నే స్వ‌యంగా రంగంలోకి దిగి.. ఉద‌యం 6 గంట‌ల‌కే ల‌బ్ధిదారుల ఇంటికి వెళ్తున్నారు.

ఎంపిక చేసిన జిల్లాల్లోగ‌త రెండుసార్లు(జూలై1, ఆగ‌స్టు 1) చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా పింఛ‌ను దారుల క‌ష్టాలు విన్నారు. వారికి నేనున్నానంటూ భ‌రోసా క‌ల్పించారు. ఇక‌, ఈ కార్య‌క్ర‌మం త‌ర్వాత‌ చేతులు ముడుచుకుని స‌చివాల‌యానికో.. ఉండ‌వ‌ల్లి నివాసానికో చంద్ర‌బాబు ప‌రిమితం కాలేదు. చేనేత జాతీయ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయా వ‌ర్గాల‌కు చేరువ అయ్యేందుకు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చారు. మంగ‌ళ‌గిరిలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. త‌ర్వాత విజ‌య‌వాడ‌లోనూ భారీ ఎగ్జిబిష‌న్‌ను ప్రారంభించారు. అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించారు. పోల‌వ‌రం ప్రాజెక్టును ప‌రిశీలించారు. మూడు సార్లు ఈ రెండు మాసాల కాలంలో ఢిల్లీ వెళ్లివ‌చ్చారు.

మ‌రోవైపు.. ఎక్క‌డ ఏ స‌మ‌స్య వ‌చ్చినా..వెళ్లి బాధితుల‌ను ఓదారుస్తున్నారు. విశాఖ‌లో సంభవించిన అచ్యుతాపురం ఘ‌ట‌న‌లో బాధితుల‌ను ఓదార్చేందుకు, ప‌రిహారం ప్ర‌క‌టించేందుకు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించారు. అదేవిధంగా గ్రామ స‌భ‌ల పేరుతో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలోనూ ఆయ‌న పాల్గొన్నారు. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. ప్ర‌జాద‌ర్బార్ పేరుతో మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మానికి కూడా చంద్ర‌బాబు త‌ర‌చుగా వెళ్తున్నారు. ఇక్క‌డ‌కు వ‌స్తున్న ప్ర‌జ‌ల క‌ష్టాలు వింటున్నారు. వారి నుంచి విన‌తులు తీసుకుంటున్నారు. ఇలా.. ఈ రెండు మాసాల కాలంలో ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటున్న ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు త‌న‌దైన ముద్ర వేసుకున్నారు.