బాలినేని ఇక వెళ్లిపోవ‌డ‌మే బెట‌రా.. !

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డికి ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి షాకిచ్చారు. ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలో గేమ్ ఛేంజ్ చేయాల‌న్న బాలినేని విన్న‌పాన్ని జ‌గ‌న్ ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. పైగా.. బాలినేని విభేదిస్తున్న నాయ‌కుల‌కే జ‌గ‌న్ పెద్ద‌పీట వేయ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు బాలినేని.. వైవీ సుబ్బారెడ్డితో పంచాయ‌తీ పెట్టుకున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో యుద్ధ‌మే న‌డిచింది. ఏకంగా.. మంత్రి ప‌ద‌వి పోయేందుకుకూడా వైవీనే కార‌ణ‌మ‌ని బాలినేని భావించారు.

ఎట్ట‌కేల‌కు.. వైవీని అక్క‌డ నుంచి త‌ప్పించారు. దీంతో బాలినేని ఊపిరి పీల్చుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. కానీ, ఇంత‌లోనే ఎన్నిక‌ల‌ స‌మ‌యంలో ఒంగోలు ఎంపీగా.. చిత్తూరుకు చెందిన చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డిని తీసుకువ‌చ్చి నియ‌మించారు. దీనిని కూడా బాలినేని తీవ్రంగా వ్య‌తిరేకించారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి కోసం.. తీవ్రంగా శ్ర‌మించారు. కానీ, బాలినేని మాట ఫ‌లించ‌లేదు. ఎట్టి ప‌రిస్థితిలోనూ మాగుంట‌కు టికెట్ ఇచ్చేది లేద‌ని… భీష్మించిన‌ జ‌గ‌న్ చెవిరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు.

ఇది మ‌రికొన్ని వివాదాల‌కు దారి తీసింది. ఎన్నిక‌ల్లో అంద‌రూ ఓడిపోయారు. ఇక‌, ఇప్పుడు.. క్షేత్ర‌స్థాయి లో చెవిరెడ్డి పట్టు పెంచుకోవ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ నుంచే తాను పోటీ చేస్తాన‌ని త‌ర‌చుగా చెబుతుండ‌డంతో బాలినేనికి కంటిపై కునుకు లేకుండాపోయింది. దీంతో చెవిరెడ్డిని ఇక్క‌డ నుంచి పంపించేయాల‌ని.. పార్టీ బాధ్య‌త‌ల‌ను తానే చూసుకుంటాన‌ని ఆయ‌న చెబుతున్నారు. కానీ, జ‌గ‌న్ మాత్రం దీనికి కూడా ఒప్పుకోలేదు. ఫ‌లితంగా బాలినేని మౌనంగా ఉంటున్నారు.

అంతేకాదు.. ఇటీవ‌ల ఒంగోలు మునిసిపాలిటీలో త‌న వ‌ర్గం వారు టీడీపీలోకి చేరిపోయినా.. ప‌ట్టీప‌ట్ట‌నట్టే వ్య‌వ‌హ‌రించారు. ఇది పార్టీ అధిష్టానానికి మ‌రింత కాక‌రేపింది. ఈ నేప‌థ్యంలో అస‌లు బాలినేనిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో చెవిరెడ్డికి మ‌రింత బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ.. తాజాగా పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. ఈ నియామ‌కంపై బాలినేని వ‌ర్గం కుత‌కుత‌లాడుతోంది.

ఎవ‌రిని అడిగి ఆయ‌న‌కు ప‌ద‌వి ఇచ్చార‌ని అంత‌ర్గ‌త సంభాష‌ణల్లో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. కానీ.. ఇప్పుడు బాలినేనిని ప‌ట్టించుకునేవారు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. దీంతో ఇక‌, ఆయ‌న పార్టీని వ‌దిలేయ‌డ‌మే మార్గంగా క‌నిపిస్తోంద‌న్న‌ది ఆయ‌న వ‌ర్గం చెబుతున్న మాట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.