ఇది పిన్నెల్లికి పరువు సమస్య

ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం పేరు ఇటీవ‌ల కాలంలో రాష్ట్రాల స‌రిహ‌ద్దులు కూడా దాటిపోయిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యంలో ఈవీఎం, వీవీ ప్యాట్‌ల‌ను ధ్వంసం చేసిన వైసీపీ నాయ‌కుడు, అప్ప‌టి ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి ఉదంతం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. త‌ర్వాత పోలీసుల‌పై దాడులు.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల కేసుల‌తో మాచ‌ర్ల వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

ఆయా కేసుల నేప‌థ్యంలో పిన్నెల్లి ప్ర‌స్తుతం జైల్లో ఉన్నారు. అయితే.. ఇక్క‌డ సుమారు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత‌.. పెను సంచ‌ల‌నం చోటు చేసుకుంది. పిన్నెల్లి హ‌యాం నుంచి ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే న‌డిచిన మాచ‌ర్ల మునిసిపాలిటీ.. కార్య‌క‌లాపాలు.. ఇక్క‌డి పాల‌వ‌ర్గం అంతా.. ఇప్పుడు మూకుమ్మ‌డిగా టీడీపీలోకి చేరారు. నిజానికి పిన్నెల్లి కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు.. త‌ర్వాత‌.. వైసీపీలోకి చేరిన‌ప్పుడు కూడా ఆయ‌న‌దే హ‌వా అన్న‌ట్టుగా ఇక్క‌డ సాగిన విష‌యం తెలిసిందే.

అంతేకాదు.. మాచ‌ర్ల‌లో వేరే పార్టీ జెండా ఎగ‌రాలంటే.. భ‌య‌ప‌డిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఏ ఎన్నిక వ‌చ్చినా పిన్నెల్లి వ‌ర్గ‌మే విజ‌యం ద‌క్కించుకునేది. ఇలానే 2021లో వ‌చ్చిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా మాచ‌ర్ల‌లో ఎవ‌రూ నామినేష‌న్ వేసేందుకు కూడా సాహ‌సించే ప‌రిస్థితి లేకుండా పోయింది. కేవ‌లం పిన్నెల్లి ఆశీస్సులు ఉన్న వారే ఇక్క‌డ నామినేష‌న్ వేసి.. విజ‌యంద‌క్కించుకున్నారు. ఇలానే మాచ‌ర్ల మునిసిపాలిటీ ఏర్ప‌డింది.

అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకున్నాయి. పిన్నెల్లి మాటే విని పించ‌డం లేదు. వైసీపీ జెండాలు క‌నిపించ‌డం లేదు. తాజా ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున జూలకంటి బ్ర‌హ్మానంద‌రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి స్థానిక నాయ‌క‌త్వం అంతా కూడా టీడీపీ వెంటే న‌డుస్తోంది. ఇలానే.. తాజా మాచ‌ర్ల మునిసిపాలిటీలోని 16 మంది కౌన్సిల‌ర్లు కూడా వైసీపీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరిపోయారు. దీంతో ఇక్క‌డ తాజాగా టీడీపీ నేతృత్వంలోని న‌ర‌సింహారావు చైర్మ‌న్‌గా ప్ర‌మాణ స్వీకారం చేశారు.