త‌మ్ముళ్ల‌కు కిక్కు.. చంద్ర‌బాబు మ‌రో పాల‌సీ..!

అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకురావాలని భావిస్తోంది. 2014-2019 మధ్య అమలైన మద్యం పాలసీనే కొద్ది మార్పులతో అమలు చేయాలని చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

2019-24 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం పై అనేక విమర్శలు వచ్చాయి. మద్య‌ నిషేధం చేస్తానని చెబుతూనే మద్యం ధరలను పెంచడం అదేవిధంగా నాణ్యమైన బ్రాండెడ్ లిక్కర్ స్థానంలో చీపులిక్కర్‌ను తీసుకురావడంతో జగన్ పై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే.

దీంతో ఇది ఎన్నికల సమయంలో ప్రభావం కూడా చూపించింది. వైసీపీ ఓడిపోవడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటిని అంటారు. ఇక దీనిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా నూతన మద్యం పాలసీని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీని ప్రకారం డివిజన్ల వారీగా మండలాల వారీగా కూడా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక్కడ చిత్రం ఏంటంటే మెజారిటీ కాంట్రాక్టులను లేదా మద్యం దుకాణాలను టిడిపి నాయకులకు ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికల సమయంలోనూ గడిచిన 5 సంవత్సరాల కాలంలోనూ పార్టీ కోసం పనిచేసిన వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసులు పెట్టించుకుని ఎదురు దెబ్బలు తిన్నవారు ఇప్పుడు దీన్ని ఉపయోగించుకునేందుకు పోటీ పడుతున్నారు. నగరాల స్థాయిలో పట్ట‌ణాల‌ స్థాయిలో మెజారిటీ షాపులను వ్యాపారులకే ఇచ్చి గ్రామీణ మండల స్థాయిలో మాత్రం టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఇవ్వాలని తద్వారా పార్టీ తరఫున వారికి కొంత భరోసా కల్పించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదే జరిగితే మండల స్థాయిలో నాయకులకు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఇది మంచిదా చెడా అనేది పక్కన పెడితే పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆర్థికంగా అయితే భరోసా కల్పించే విషయంలో టిడిపి ఒక సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఈ విషయంలో బిజెపి, జనసేన పార్టీలు ముందుకు రాకపోవచ్చు. కానీ, ఇక్కడ ప్రధానంగా టిడిపికి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో పని చేసింది.

ఈ నేపథ్యంలో వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు లేదా ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఈ తరహా ప్రయత్నం చేస్తున్నారనేది ఒక చర్చ. ఇది తప్పేమీ కాదని టిడిపి నాయకులు కూడా భావిస్తున్నారు. వ్యాపారం చేయడం ద్వారా ప్రభుత్వానికి పన్నులు వస్తాయని ఇది ఎవరు చేసినా ఒకటేనని కాబట్టి టిడిపి నాయకులకు ఇచ్చినంత మాత్రాన‌ తప్పేమీ కాదని రాష్ట్రస్థాయి నాయకులు అంటున్నారు. దీనిపై విపక్షాలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాయనేది చూడాలి.