మరో రెండ్రోజుల్లో నాపై దాడి జరగొచ్చు: రఘురామ

కొద్ది రోజులుగా వైసీపీ సర్కార్, సీఎం జగన్ లపై నర్సాపురం ఎంపీ రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై ఇప్పటికే పలు విమర్శలు గుప్పించిన రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను కూడా కోరారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు, రఘురామ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తాను వాటికి భయపడనని రఘురామ గతంలో చెప్పారు. తాజాగా తనపై, తన కార్యాలయంపై దాడికి కార్యాచరణ రూపొందిందని, మరో రెండు మూడు రోజుల్లో దాడి జరగనుందని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, మరో రెండు, మూడు రోజుల్లో దాడి జరగనుందని అన్నారు. తనకు కరోనా వైరస్ అంటించేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని, క్రిస్టియన్ దళితులతో తనపై దాడి చేయించేందుకు యత్నిస్తున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు.

దాడి చేస్తే ఆవేశపడి తాను మాట జారతాననే ఆలోచనల్లో వాళ్లు ఉన్నారని రఘురామ అన్నారు. ఓ ఎంపీ అన్న వ్యాఖ్యలను తాను ప్రస్తావిస్తే.. దానికి ఓ జాతిని సంఘటితం చేసి.. వాళ్ల జాతిని అవమానించినట్టు చిత్రీకరించారని వెల్లడించారు. అయితే, తనకు పలు దళిత సంఘాల మద్దతుందని చెప్పారు. దళిత క్రిస్టియన్లు హిందువుల ముసుగులో రిజర్వేషన్లు కొట్టేస్తున్నారని తాను అన్నానని, అందుకే హిందూ దళిత నాయకులు తన వెంట నిలిచారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ఆటవిక పాలన కొనసాగుతోందని రఘురామ విమర్శించారు. రాష్ట్రంలో హిందూ మతంపై దాడి జరుగుతోందని, హిందువులు మేల్కొని దాడిని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పోలీసులకు చట్టంపై అవగాహన లేదని, తాను ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నానని చెప్పారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన తనకు లేదని తెలిపారు. ఈ కుట్రలు, విషయాలన్నీ ప్రజలకు తెలియాలనే వెల్లడిస్తున్నానని అన్నారు.