టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్రంలోని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. “నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళామతల్లుల పేరు పైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే” అని పేర్కొన్నారు.
అదేవిధంగా మహిళా సాధికారత కోసం ‘డ్వాక్రా’ సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం కృషిచేశామని చంద్రబాబు తెలిపారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్దికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘రక్షాబంధన్’ సమయంలో మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలకు అన్నివేళలా, అన్నివిధాల అండగా ఉంటానని హామీ ఇస్తున్నానన్నారు. ఇక్కడితో సరిపుచ్చారు.
కానీ, ఇది మహిళల్లో అంతగా ఆనందం అయితే నింపలేదు. ఎందుకంటే.. ఎన్నికలకు ముందు ప్రకటిం చిన సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు మూడు కీలక మైన పథకాలను చంద్రబాబు ప్రకటించారు. 1) ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 2) ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన యువతులు, మహిళలకు నెలనెలా రూ.1500 చొప్పున ఇస్తామన్నారు. 3) దీపం పథకం కింద ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లను కూడా అందిస్తామన్నారు. ఎంత భారమైనా.. రాష్ట్ర మహిళల కోసం భరిస్తామని కూడా చెప్పారు.
ఈ నేపథ్యంలో రాఖీ పండుగను పురస్కరించుకుని చంద్రబాబు.. వీటిలో ఒక్క పథకాన్నైనా ప్రకటించి ఉంటే.. ఆ గ్రాఫ్ వేరేగా ఉండేది. వాటిని ఇప్పటికిప్పుడు అమలు చేయకపోయనా.. ఫలానా రోజు నుంచి అమలు చేస్తామని ఆయన చెప్పి ఉంటే.. బాగుండేది. దీంతో మహిళలు.. ఈ రాఖీ సందర్భంగా తమకు చందన్న మంచి ప్రకటన చేశారని మురిసిపోయి ఉండేవారు. అంతేకాదు.. వారిలో సూపర్ సిక్స్‌పై మరింత భరోసా కలిగి ఉండేది. కానీ, ఎందుకో చంద్రబాబు ఈ చిన్న లాజిక్కును మిస్కయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates