మరో ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా వ్యవహరించిందనే వాదన ఉంది. ప్రతిపక్షాలను కనీసం నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నారనే వాదన ఉంది. నిజానికి ఇది కూడా స్థానికంగా వైసీపీకి వ్యతిరేకతను పెంచేసింది. అయినప్పటికీ.. తాడిపత్రి వంటి చోట్ల టీడీపీనే దక్కించుకుంది. ఇక, ఇప్పుడు మరో ఏడాదిన్నరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికలు కూటమి సర్కారు కంటే కూడా.. వైసీపీకి అత్యంత కీలకం. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ.. ప్రజల మద్దతు మాత్రం తమకే ఉందని.. కూటమి పార్టీలు ప్రజలను మాయ చేసి అధికారంలోకి వచ్చాయని చెబుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ప్రజలు తమకే ఓటేస్తారని భావిస్తున్న వైసీపీకి వచ్చే స్థానిక ఎన్నికలు అత్యంత కీలకంగా మారుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోఆ పార్టీ ఏం చేస్తోందన్నది ప్రశ్న.
ఇటీవల విశాఖ కార్పొరేషన్‌లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగినప్పుడు.. ఆ బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డిపై ఉంచిన జగన్.. తాను నిమిత్తమాత్రంగా వ్యవహరించారు. ఇక్కడి లోతుపాతులను, రాజకీయాలను అంచనా వేయలేక పోయిన.. వైవీ.. చివరకు స్టాండింగ్ కమిటీని వదులుకునే పరిస్థితి వచ్చింది. ఇదేసమయంలో బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నిక విషయానికి వస్తే.. జగన్ స్వయంగా రంగంలోకి దిగి.. సరిదిద్దారు. ఫలితంగా దీనిని ఆయన సాధించుకున్నారు.
అంటే.. ఇప్పుడున్న పరిస్థితిలో స్థానిక ఎన్నికలను కూడా జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనే స్వయంగా రంగంలోకి దిగి.. పరిస్థితులను సరిదిద్దడంతోపాటు.. నాయకుల్లో భరోసాను కూడా ప్రోదిచేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏ చిన్న తేడా జరిగినా.. లేక ఇతర నాయకులకు బాధ్యతలు అప్పగించినా.. విఫలం కావడం ఖాయమనే అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు జగన్ ఏదైతే వ్యతిరేకత ఉందని అనుకుంటున్నారో.. దానిని ఇప్పటి నుంచి ప్రొజెక్టుచేసుకుంటే తప్ప.. ఆయనకు సక్సెస్ దక్కదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates