అన్న క్యాంటీన్ సూపర్ హిట్

ఏపీలో అన్న క్యాంటీన్ల జోరు కొన‌సాగుతోంది. ఒకేసారి శుక్ర‌వారం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల‌ను టీడీపీ నాయ‌కులు, మంత్రులు ప్రారంభించారు. గురువారం స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని సీఎం చంద్ర‌బాబు గుడివాడ‌లో తొలి అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. అయితే..తొలి ద‌శ‌లో మొత్తం 100 క్యాంటీన్లు ప్రారంభిస్తామ‌ని చెప్పిన స‌ర్కారు.. ఆమేర‌కు ఏర్పాట్లు చేసింది. అన్నీ గురువార‌మే ప్రారంభించాల‌ని అనుకున్నా.. కొంద‌రు మంత్రులు శ్రావ‌ణ శుక్ర‌వారం సెంటిమెంటును కూడా దీనికి జోడించారు.

ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు క‌వ‌ర‌య్యేలా మిగిలిన 99 క్యాంటీన్ల‌ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ మంత్రులు, జ‌న‌సేన మంత్రులు దుర్గేష్ వంటివారు కూడా పాలుపంచుకున్నారు. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో రెండు కు మించి క్యాంటీన్ల‌ను ప్రారంభించ‌డం గ‌మ‌నార్హం. విశాఖ‌, విజ‌య‌వాడ‌, గుంటూరు వంటి జ‌న‌స‌మ్మ‌ర్థ ప్రాంతాల్లో 4 నుంచి 6 చొప్పున ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఆయా క్యాంటీన్ల‌ను ప్రారంభించిన అనంతరం ఆహార ప‌దార్థాల టేస్ట్ కూడా చూశారు. అంతా బాగుంద‌ని మంత్రులు, నాయ‌కులు సంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఉద‌యం అల్పాహార స‌మ‌యంలోనే క్యాంటీన్ల‌ను ప్రారంభించ‌డంతో జ‌నాలు జోరుగా క్యాంటీన్ల ముందు క‌నిపించారు. అన్ని క్యాంటీన్ల వ‌ద్ద రెండేసి చొప్పున లైన్లు క‌నిపించాయి. ఉద‌యం 7 గంట‌ల నుంచే అల్పాహారం కోసం త‌ర‌లి రావ‌డంతో 8 గంట‌ల‌కే చాలా చోట్ల పెద్ద ఎత్తున జ‌నాలు గుంపులుగుంపులుగా క‌నిపించారు. తొలి రోజు కావ‌డంతో ఆయాక్యాంటీన్ల‌ను ప్రారంభించే వ‌ర‌కు వేచి చూసి.. త‌ర్వాత అల్పాహారం తీసుకున్నారు. ప‌లుచోట్ల మంత్రులు తొలి వ‌డ్డ‌న చేశారు. అక్క‌డే వారు కూడా టిఫిన్ చేశారు. మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి భోజ‌నాల‌ను కూడా అందించారు.

పింఛ‌ను విరాళం

ఇదిలావుంటే.. రెండోరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల‌కు సాధార‌ణ ప్ర‌జ‌లు సైతం విరాళాలు అందించారు. మ‌ధ్యాహ్నానికి రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు సొమ్ము అందిన‌ట్టు మునిసిప‌ల్ శాఖ తెలిపింది. మ‌రింత మంది అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాల‌ని కోరింది. మంగ‌ళ‌గిరిలో ఓ వృద్ధురాలు.. త‌న పింఛ‌ను రూ.4000ల‌ను క్యాంటీన్‌కు విరాళంగా ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. స‌త్య సాయి జిల్లాలోని ఓ కుటుంబం రూ.2 ల‌క్ష‌లు బాల‌య్య‌కు అందించింది. అదేవిధంగా ప‌లువురు ప్ర‌భుత్వ ఉద్యోగులు ఒక‌రోజు వేత‌నాన్ని విరాళంగా ఇచ్చారు. ఇలా.. తొలి రెండురోజుల్లోనే అన్న‌క్యాంటీన్ల‌కు ప్ర‌జ‌ల నుంచి బ‌ల‌మైన మ‌ద్ద‌తు ల‌భించ‌డం విశేషం.