గవర్నర్ కోటాలో శాసన మండలికి ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్‌లు ఎమ్మెల్సీలుగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో బీఆర్ఎస్ నుంచి గవర్నర్ కోటాలో ఎంపికై.. న్యాయ పోరాటం చేస్తున్న దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణలకు భారీ షాక్ తగలినట్టయింది. అప్పటి గవర్నర్ తమిళిసై.. ఉన్న సమయంలో దాసోజు, కుర్రాలను బీఆర్ఎస్ అధినేత, అప్పటి సీఎం కేసీఆర్.. వీరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు.
కానీ, అప్పటి గవర్నర్ వీరిని తాత్సారం చేశారు. తర్వాత ఏకంగా వీరి నియామకాన్ని రద్దు చేశారు. దీంతో కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ జనసమితి అధినేత, ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను సీఎం రేవంత్ రెడ్డి ఎంపిక చేశారు. వీరిని మండలికి పంపించేందుకు రెడీ అయ్యారు. అయితే.. దీనిని దాసోజు, కుర్రాలు హైకోర్టులో సవాల్ చేశారు. తాము ఉండగా వీరి నియామకం చెల్లదని పేర్కొన్నారు. దీంతో హైకోర్టు వీరికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
అయితే.. హైకోర్టు మార్చి 7న ఇచ్చిన ఈ తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. దీంతో కొత్త వారిని ఎంపిక చేసుకునేందుకు మార్గం సుగమం అయింది. ఆ వెంటనే.. శుక్రవారం ఉదయం కోదండరామ్, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వీరిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. తనకు దక్కిన పదవితో ఉద్యమకారులు ఆనందంగా ఉన్నట్టు చెప్పారు. సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, వారి సమస్యల ముందు.. ఇవి తమకు అదనపు బాధ్యతేలనన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించుకుంటామని.. ఇవి తమకు మరింత బాధ్యతలను పెంచాయని తెలిపారు. ఇదిలావుంటే.. వీరినియామకంపై దాసోజు, కుర్రాలు.. మరోసారి న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు స్టే మాత్రమే ఇచ్చిందని.. పూర్తిస్థాయిలో తీర్పు ఇవ్వలేదని.. కాబట్టి ఈ నియామకాలు చెల్లబోవని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates