‘వైసీపీ ఐపీఎస్‌’ల‌కు అట్టెండన్స్ పనిష్మెంట్

ఏపీలో గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో ఆ పార్టీ నాయ‌కుల‌కు అన్ని విధాలా స‌హ‌క‌రించిన‌ట్టుగా టీడీపీ నేత‌ల తో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ఐపీఎస్‌లు కొంద‌రు ఉన్నారు. ముఖ్యంగా అప్ప‌టి సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు వీరు ఆడార‌ని.. అన‌వ‌స‌రంగా త‌మ‌పై కేసులు పెట్టి వేధించార‌ని టీడీపీ నాయ‌కులు ప‌లు సంద‌ర్భాల్లో చెప్పు కొచ్చారు. త‌ర్వాత కాలంలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక ఇలా.. వైసీపీ ఐపీఎస్‌లుగా తాము ఆరోపించిన వారిని బ‌దిలీ చేయ‌డం.. విధుల నుంచి దూరం పెట్ట‌డం తెలిసిందే.

ఇలాంటి వారిలో కీల‌క‌మైన సీఐడీ చీఫ్‌(అప్ప‌టి) సంజ‌య్‌, నిఘా విభాగం చీఫ్ సీతారామాంజ‌నేయులు, విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్‌ కాంతిరాణా టాటా, ఐపీఎస్‌లు కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, గుంటూరు ఎస్పీగా ప‌నిచేసిన విజయరావు, విజ‌య‌వాడ ఏసీపీగా ప‌నిచేసిన విశాల్‌గున్ని, రవిశంకర్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రఘువీరారెడ్డి, అనంత‌పురం ఎస్పీగా ప‌నిచేసిన‌ పరమేశ్వర్‌రెడ్డి, కృష్ణాజిల్లా ఎస్పీగా ప‌నిచేసిన‌ జాషువా, కృష్ణకాంత్‌ పటేల్‌, గుంటూరు ఐజీగా ప‌నిచేసిన పాలరాజుల‌ను చంద్ర‌బాబు స‌ర్కారు ప‌క్క‌న పెట్టింది.

వీరికి ఎలాంటి పోస్టింగులు ఇవ్వ‌కుండా.. వీఆర్‌లో ఉంచారు. అంతేకాదు.. వారి హ‌యాంలో జ‌రిగిన అవ‌క త‌వ‌క‌ల‌పైనా విచార‌ణ చేయిస్తున్నారు. ఎవ‌రిపై ఎలాంటి కేసులు పెట్టించార‌నే విష‌యంపైనా కూట‌మి ప్ర‌భుత్వం విచార‌ణ చేయిస్తోంది. దీంతో వారంతా పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిపోయారు. ఒక‌రిద్ద‌రు పొరుగు దేశాల‌కు వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించి భంగ ప‌డ్డారు. వీరికి ప్ర‌బుత్వం అనుమ‌తి ఇవ్వ‌లేదు. అయితే.. ఇప్పుడు వీరికి షాకిస్తూ.. చంద్ర‌బాబు స‌ర్కారు మ‌రో ఆదేశం జారీ చేసింది.

వీఆర్‌లో ఉన్న పైన చెప్పుకొన్న ఐపీఎస్‌లు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంట‌ల వరకు మంగ‌ళగిరిలోని డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ప్ర‌భుత్వం త‌ర‌ఫున డీజీపీ ద్వార‌కా తిరుమ‌ల రావు ఆదేశించారు. విధులు ముగిశాక అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లాలని పేర్కొన్నారు. అంతేకాదు.. రోజూ హెడ్‌ క్వార్టర్లలో రిపోర్టు చేయాలని తెలిపారు. ఆఫీసుకు వ‌చ్చి.. వెళ్లిన స‌మ‌యంలో ఏం చేస్తున్నారో కూడా చెప్పాల‌ని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు వారంద‌రికీ న‌ట్లు బిగించిన‌ట్టు అయింద‌ని అంటున్నారు.