వైసీపీ అధినేత గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అది కూడా మామూలుగా కాదు. అదిరిపోయేలా ఆయన సిద్ధం అవుతున్నారు. తన పార్టీని కూడా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ తరఫున మహిళా గొంతుక అంటూ ప్రత్యేకంగా లేక పోయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు విజయమ్మ, షర్మిల.. పార్టీకి అండగా నిలిచారు. వారు బలమైన వాయిస్ వినిపించి.. మహిళలను పార్టీవైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు. కానీ, 2024 ఎన్నికలకు ముందు కేవలం మహిళా పథకాలు మాత్రమే పార్టీకి దన్నుగా నిలిచాయి.
కానీ, ఆ పథకాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇంకా ఎక్కువ ఇస్తామన్న చంద్రబాబు వెంటే మహిళలు ముందుకు నడిచారు. వచ్చేఐదేళ్ల రాజకీయం తలుచుకుంటే.. ఇది మరింత పెరుగుతుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే.. ఇక, వైసీపీని మరిచిపోయే అవకాశం కూడా మహిళల్లో ఉంది. అదేసమయంలో తల్లికి వందనం పేరుతో ప్రారంభించే పథకానికి మరిన్నిరెట్ల ఓటు బ్యాంకు కకావికలం అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.
దీనిని ఇప్పుడే అంచనా వేసుకున్న వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా గ్రౌండ్‌ను ప్రిపేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తన సతీమణి వైఎస్ భారతిని రంగంలోకి తీసుకువచ్చే అంశంపై గత నాలుగు రోజులుగా ఆయన తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. వచ్చినా.. కేవలం కడప జిల్లా వరకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఆమె దూకుడు పెంచేందుకు, మహిళలను తనవైపు తిప్పుకొనేందుకు భారతిని ప్రయోగించాలని జగన్ భావిస్తున్నారు.
దీనిలో భాగంగానే త్వరలోనే భారతి తన రాజకీయాలు ప్రారంభించే అవకాశం ఉంది. వచ్చే జనవరి లేదా ఈ లోగానే ఆమె రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన రానుందని తెలుస్తోంది. అప్పట్లో షర్మిల అడ్డుగా ఉన్నా.. ఇప్పుడు ఎవరూ పార్టీలో భారతికి పోటీ ఇచ్చే అవకాశం లేదు. పైగా జగన్ సతీమణిగా కంటే వైఎస్ కోడలుగా ఆమె రాజకీయాలు చేస్తారని తెలుస్తోంది. ఇదే జరిగితే.. వైసీపికి మరింత బూస్ట్ వస్తుందన్న అంచనాతో జగన్ ఉన్నారు. ఆమె రావడమే కాదు.. ప్రారంభమే అదిరిపోయేలా ఉంటుందని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates