ఇప్పుడు ప్లేట్, ఫేట్ రెండూ మారుతున్నాయి

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చాలా ముందు చూపే ఉన్న‌ట్టుగా ఉంది. ఎప్పుడో రెండు మాసాల త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల‌ను ఆయ‌న ముందుగానే ప‌సిగ‌ట్టిన‌ట్టుగా ఉన్నారు. రెండు నెల‌ల త‌ర్వాత ఏం జ‌రుగుతుందో ఇప్పుడే అంచ‌నా వేసుకున్న‌ట్టుగా ఉన్నారు. అందుకే చాలా వ్యూహాత్మ‌కంగా జాతీయ స్థాయిలో రాజ‌కీయా ల‌ను క‌దుపుతున్నార‌న్న చ‌ర్చ సాగుతోంది. ముందు చూపుతోనే.. జ‌గ‌న్ ఇండియా కూట‌మి పార్టీల‌కు ట‌చ్‌లో ఉన్నార‌ని తాజాగా జ‌రుగుతున్న విశ్లేష‌ణ‌. ఇటీవ‌ల ఆయ‌న ఢిల్లీలో ధ‌ర్నా చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

ఈ ధ‌ర్నాకు.. ఇండియా కూట‌మిలోని ఎస్పీ, ఆర్జేడీ, తృణ‌మూల్‌, శివ‌సేన త‌దిత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కులు వ‌చ్చారు. జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. అయితే.. అనూహ్యంగా జ‌గ‌న్ ఇలా ఎందుకు మారా రా? మోడీని వ‌దిలేసి ఇండియ కూట‌మి వెనుక ఎందుకు ప‌డ్డారా? అనే చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది. అయితే..అ ప్ప‌ట్లో అనేక విశ్లేష‌ణ‌లు వ‌చ్చినా.. ఇప్పుడు ఊహ‌కంద‌ని మ‌రో విష‌యం వెలుగు చూసింది. బీజేపీకి వైసీపీ అవ‌స‌రం ఉంటుంద‌ని కొన్నాళ్ల కింద‌ట విజ‌య‌సాయిరెడ్డి చెప్పిన విష‌యం గుర్తుండే ఉంటుంది.

“చంద్ర‌బాబుకు పార్ల‌మెంటులో 16 మంది ఎంపీలుంటే.. మాకు(వైసీపీ) 15 మంది ఎంపీలు ఉన్నారు. మేం ఎక్క‌డా త‌క్కువ‌కాదు” అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అంటే.. వైసీపీకి రాజ్య‌స‌భ‌లో 11+లోక్‌స‌భ‌లో 4 క‌లుపుకొని ఆయ‌న అలా చెప్పారు. ఇది వాస్త‌వ‌మే. రాజ్య‌స‌భ‌లో టీడీపీకి స‌భ్యులే లేనందున‌.. త‌మ‌తో త‌ట‌స్థంగా ఉన్న వైసీపీకి క‌లుపుకొని వెళ్లేందుకు బీజేపీ స‌హ‌జంగానే ప్ర‌య‌త్నిస్తుంది. స్పీక‌ర్ ఎన్నిక స‌మ‌యంలో బీజేపీ నుంచి వైసీపీకి ఫోన్ రావ‌డానికి కార‌ణం ఇదే.

అందుకే జ‌గ‌న్‌కు.. ఇప్ప‌టివ‌ర‌కు భ‌రోసా ఉంది. అయితే.. ఇప్పుడు ప్లేట్, ఫేట్ రెండు మారుతున్నాయి. సెప్టెంబ‌రులో జ‌ర‌గ‌నున్న రాజ్య‌స‌భ ఎన్నికల్లో బీజేపీకి 11 మంది కొత్త స‌భ్యులు తోడ‌వుతారు. ఈ సంఖ్య వైసీపీతో స‌మానం. ఇక‌, ఇప్ప‌టికే ఉన్న మిత్ర‌ప‌క్షాల స‌భ్యుల‌తో క‌లిసి.. 126 మంది స‌భ్యులు బీజేపీకి అందుబాటులోకి వ‌స్తారు. ఇది భారీ మెజారిటీ. ఇక‌, ఇత‌ర పార్టీల‌తో(మిత్ర‌ప‌క్షాలుకాకుండా. వైసీపీ మిత్ర‌ప‌క్ష‌మే కానీ.. కూట‌మి పార్టీ కాదు) బీజేపీకి ప‌నిలేదు.

అప్పులు వైసీపీ ప‌ప్పులు ఉడికే ప‌రిస్థితి లేదు. బీజేపీ ఖ‌చ్చితంగా పక్క‌న పెడుతుంది. దీనిని గ్ర‌హించిన జ‌గ‌న్‌.. ఇప్ప‌టినుంచే ఇండియ కూట‌మికి చేరువ అవుతున్నార‌నేది తాజా విశ్లేష‌ణ‌. అంతేకాదు.. క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్‌తో భేటీ కావ‌డం వెనుక కూడా ఇదే వ్యూహం ఉండి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. త‌ద్వారా.. బీజేపీ దూకుడును త‌గ్గించాల‌న్న‌ది జ‌గ‌న్ వ్యూహం. మ‌రి ఈ వ్యూహం స‌క్సెస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? అనేది చూడాలి.