క‌ళ్ల‌లో కారం చ‌ల్లి.. టీడీపీ నేత దారుణ హ‌త్య‌

ఏపీలో ఘోరం చోటు చేసుకుంది. టీడీపీ నాయ‌కుడు, ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని ప‌త్తికొండ నియోజ‌కవ‌ర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అనుచ‌రుడు, 45 ఏళ్ల‌ వాకిటి శ్రీను దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. బుధ‌వారం తెల్ల‌వారుజామున నియోజ‌క‌వ‌ర్గంలోని శివారు ప్రాంతం హోసూరులో బ‌హిర్భూమికి వెళ్లిన శ్రీనును కొంద‌రు వ్య‌క్తులు అనుస‌రించి.. క‌ళ్ల‌లో కారం చ‌ల్లి వెంట తెచ్చుకున్న క‌త్తుల‌తో దారుణంగా హ‌త్య చేశారు. అయితే.. ఎవ‌రు చేశార‌న్న‌ది మాత్రం ఇంకా తెలియ‌లేదు.

సుమారు 20 ఏళ్లుగా వాకిటి శ్రీను.. కేఈ కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడుగా మెలుగుతున్నారు. గ‌తం లో మండ‌ల స్థాయిలో చిన్న‌పాటి ప‌ద‌విని కూడా ఆయ‌న చేసిన‌ట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ నేత‌ల‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు చేయ‌డం, వారికి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌డంతో వైసీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని కుటుంబాలు టీడీపీకి అనుకూలంగా మారాయ‌నే వాద‌న ఉంది. ఈ కార‌ణంగానే వైసీపీ నాయ‌కులు ఆయ‌న‌ను హ‌త్య చేసి ఉంటార‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు న‌మోదు చేశారు. హ‌తుడు శ్రీను కు ఉన్న పరిచయాలు, ఇతర గొడవలపై ఆరా తీశారు. టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కూడా ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యేకు ఇటీవ‌ల కాలంలో శ్రీను ప్రధాన అనుచరుడిగా మారారు. పార్టీని గెలిపించ‌డంలోనూ.. మండ‌ల స్థాయిలో నాయ‌కుల‌ను చేర‌దీయ‌డంలోనూ శ్రీను కీల‌క పాత్ర పోషించిన‌ట్టు తెలిసింది.

అయితే.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచ‌రుల‌కు, శ్రీను కు మ‌ధ్య కొన్నాళ్లుగా తీవ్ర ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న హ‌త్య‌కు గురి కావ‌డంతో వైసీపీ నేత‌ల పాత్ర ఉండి ఉంటుంద‌ని శ్యాంబాబు అనుమానాలు వ్య‌క్తం చేశారు. దీనిపై విచార‌ణ చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు. ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌బోమని డీఎస్పీ చెప్పారు. కాగా, ఈ హ‌త్య అనంత‌రం ప‌త్తికొండ‌లో ఎలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా.. ముంద‌స్తుగా 114 సెక్ష‌న్‌ను అమ‌లు చేస్తున్న‌ట్టు డీఎస్పీ ప్ర‌క‌టించారు.