అవునన్నా కాదన్నా.. చంద్రబాబుతో పోల్చినప్పుడు.. జగన్ జూనియరేకదా! సో.. పనితీరులోనూ అదే కని పించిందని అంటున్నారు పరిశీలకులు. జూనియర్‌గా ఆయన ఐదేళ్లు పనిచేసి.. ప్రజల మనసులు చూర గొనలేకపోయారనే వాదన సొంత పార్టీలోనే అనేక మంది నాయకులు నోరు విప్పి మరీ చెప్పేస్తున్నారు. ఇక, సీనియర్ మోస్ట్(ప్రస్తుతం ఉన్న నాయకుల్లో) నాయకుడైన చంద్రబాబు తనదైన పంథాలో ముందు కు సాగుతున్నారు. అయితే.. ఇప్పుడు ఈ విషయం ఎందుకు? అంటారా? ఇక్కడే ఉంది అసలు కథ.
జగన్ హయాంలో అన్నీ తానై వ్యవహరించారు. అంటే.. ఎవరి పనిని వారిని చేసుకోనివ్వలేదన్న వాదన అప్పట్లో బలంగా వినిపించింది. మాట్లాడే విషయానికి వస్తే.. తన పనిని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారికి అప్పగించేసి.. తాడేపల్లిలో ఉండిపోయేవారు. ఇక, శాఖల పరంగా మంత్రులు చేయాల్సిన పనులు మాత్రం జగన్ చేసేసేవారు. ఉదాహరణకు రైతులకు సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదల చేయాలని అనుకుంటే.. జగన్ రంగంలోకి దిగిపోయేవారు. తనే బటన్ నొక్కేశారు.
కానీ, పక్కనే ఆ శాఖ(వ్యవసాయం) మంత్రి ఎవరుంటే వారు(కన్నబాబు, కాకాని గోవర్ధన్) చేతులు కట్టుకుని పక్కన నిలబడి నవ్వులు చిందించేవారు. అంటే.. ఇది ఒక రకంగా మంత్రుల పనులను కూడా హైజాక్ చేయడమే. ఇది ఒక్క వ్యవసాయమే కాదు. బీసీ సంక్షేమ మంత్రి పనిని కూడా జగనే చేసేవారు. అలానే మైనారిటీ, మహిళా సంక్షేమం.. ఇలా అన్ని శాఖలకు సంబంధించిన బటన్ నొక్కే కార్యక్రమాలను జగనే చేసేవారు. దీంతో మంత్రుల పనిని ఆయనే చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి.
దీనికితోడు మంత్రులకు వాయిస్ ఉండేది కాదు. సీఎంకే రంగంలోకి దిగిపోయి బటన్ నొక్కేస్తే.. ఇక, మిగిలిన మంత్రులకు నిజంగానే పని ఉండదు కదా! దీంతో వారికి ఫాలోయింగ్ కూడా అంతే ఉండేది. ఇప్పుడు కూటమి సర్కారు విషయానికి వస్తే.. ఎవరి పనిని వారు చేసుకునేలా చంద్రబాబు స్వేచ్ఛనిస్తు న్నారు. తాను వేలు పెట్టకపోగా.. ఇతరులను కూడా వేలు పెట్టొద్దని గట్టిగానే చెబుతున్నారు. ఉదాహరణకు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు వ్యవహారంపై తొలుత రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు.
వాస్తవానికి దీనిపై స్పందించాల్సింది రవాణా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి. కానీ, అనగాని రియాక్ట్ అయ్యారు. దీంతో చంద్రబాబు ఇద్దరిపైనా ఫైరయ్యారు. ఎవరి పని వారు చేయాలన్నారు. ఇక, 4 వందల కోట్ల రూపాయలను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమంలో చంద్రబాబు అనుకుంటే ఆయనే పాల్గొనేవారు. కానీ.. తనకు పేరు వస్తుందని తెలిసినా.. ఆ విషయంలో జోక్యం చేసుకోలేదు.
నిధులు విడుదల చేసి.. వాటిని రైతులకు పంపిణీ చేసే బాధ్యతను సంబంధిత మంత్రి, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌కే అప్పగించారు. అంటే.. ఎవరి పనిని వారితో చేయించడం ద్వారా.. ప్రజలకు నాయకులకు మధ్య ఏర్పడాల్సిన బంధాన్ని ఎక్కడా చెడగొట్టకుండా.. చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలను చూసినవారే.. జూనియర్ జగన్‌కు-సీనియర్ బాబుకు మరో తేడా ఇదే! అంటున్నారు.