అగ్రిగోల్డ్ ఎఫెక్ట్‌: వైసీపీ నేత‌ కొడుకు అరెస్టు

వైసీపీ మాజీ మంత్రి, ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడు జోగి ర‌మేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు అరెస్టు చేశారు. విజ‌య‌వాడ స‌మీపంలోని ఇబ్ర‌హీంప‌ట్నంలో ఉన్న నివాసంలో రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ‘అగ్రిగోల్డ్‌’ భూముల‌కు సంబంధించిన అవ‌క‌త‌వ‌క‌ల వ్య‌వ‌హారంలో జోగి ర‌మేష్‌పై ఇప్ప‌టికే కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఇబ్ర‌హీంప‌ట్నంలోని జోగి ఇంట్లో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజాము నుంచే ఏసీబీ అధికారులు సోదాలు చేప‌ట్టారు.

సుమారు 15 మందితో కూడిన అధికారుల బృందం ప‌లు ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. సోదాలు జ‌రిగిన స‌మ‌యంలో ర‌మేష్ ఇంట్లో లేక‌పోవ‌డంతో ఆయ‌న కుమారుడు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలిసింది. దీనిపై రాజీవ్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కూటమి ప్ర‌భుత్వం త‌మ కుటుంబంపై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. తాము అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌న్నారు. ఉద్దేశ పూర్వ‌కంగానే త‌మ‌పై దాడులు చేస్తున్నార‌ని పేర్కొన్నారు.

అస‌లేం జ‌రిగింది?

రెండు ద‌శాబ్దాల కింద‌ట అగ్రిగోల్డ్ సంస్థ‌.. ప్ర‌జ‌ల నుంచి సొమ్ములు సేక‌రించి బోర్డు తిప్పేసింది. దీనిపై దాఖ‌లైన కేసుల విచార‌ణ సంద‌ర్భంగా హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది. అగ్రిగోల్డ్ ఆస్తుల‌ను విక్రయించి.. డిపాజిట్ దారుల‌కు న్యాయం చేయాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో ఆయా భూముల‌ను విక్ర‌యించే ప్ర‌య‌త్నం చేశారు. ఇక్క‌డే వైసీపీ హ‌యాంలో కొన్ని అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌లు వినిపించాయి.

సీఐడీ జ‌ప్తులో ఉన్న భూముల‌ను జోగి ర‌మేష్ కొనుగోలు చేశార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అంతేకాదు.. ఆయా భూముల‌ను అమ్మేశార‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. దీనిని ఎన్నిక‌ల ముందు కూడా టీడీపీ నాయ‌కు లు పేర్కొన్నారు. ఇక‌, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ కథేంటో తేల్చేందుకు ఏసీబీకి అప్ప‌గించారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఏసీబీ అధికారులు జోగి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయ‌న లేక‌పోయేస‌రికి ఆయ‌న కుమారుడు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.