కాంగ్రెస్ లో ఫ్రెండ్స్ ఆప్ కాంగ్రెస్ యూఎస్ఎ కలకలం !

రాజకీయాల్లో అధికార పార్టీ మీద ప్రతిపక్షం, ప్రతిపక్షం మీద అధికార పార్టీ ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ అధికార పార్టీ మీద ఆ పార్టీకి చెందిన అభిమానులే ఆరోపణలు చేస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయి ? తాజాగా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా వివిధ కంపెనీలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాల మీద ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఎ నేరుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాసిన బహిరంగలేఖ కలకలం రేపుతున్నది. 

ఈ మేరకు లేఖను అక్కడి ఎన్ఆర్ఐలు తమ ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయడం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన మీద అనుమానాలను పెంచుతున్నది. రేవంత్ సోదరుడు జగదీశ్వర్ రెడ్డి భాగస్వామిగా ఉన్న స్వచ్చ్ బయో తెలంగాణలో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతుందని ఈ మేరకు రేవంత్ ఒప్పందం చేసుకున్నారు. కేవలం 15 రోజుల కింద ఏర్పడిన కంపెనీ ఎలా పెట్టుబడులు పెడుతుందని వారు ప్రశ్నించారు. అసలు ఆ కంపెనీకి కనీసం వెబ్ సైట్ కూడా లేదని ప్రశ్నించారు.

ఇక రేవంత్ మరో సోదరుడు ఎనుముల తిరుపతిరెడ్డి భాగస్వామిగా  దాదాపు రెండు నెలల క్రితం ఏర్పాటయిన అర్బన్ ప్రిస్మ్ ఇన్ ఫ్రా మీద కూడా వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కంపెనీల మీద, ఒప్పందాల మీద ఒకసారి విచారణ చేయాలని వారు రాహుల్ గాంధీని కోరారు. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ కార్యదర్శి రామక్రిష్ణారావులు ఈ ఒప్పందాలలో భాగస్వాములు కావడాన్ని తప్పుపట్టారు.

రేవంత్ అమెరికా పర్యటనలో కుదుర్చుకుంటున్న ఒప్పందాల మీద ఆరోపణల నేపథ్యంలో నేరుగా తొలిసారి పరిశ్రమల కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ కార్యదర్శి రామక్రిష్ణారావులు ఇవన్ని పెట్టుబడులు కూడా నిజమైనవేనని, ఎలాంటి పొరపాట్లకు తావులేదని వీడియో ప్రకటనలు విడుదల చేశారు. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ సానుభూతిపరులుగా ఉన్నా ఎన్నారైలే రాహుల్ గాంధీకి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.