టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహం వేస్తే.. తిరుగుండదని అంటారు. గతంలో సెల్ ఫోన్లను తీసుకువచ్చినప్పుడు.. ఐటీని డెవలప్ చేసినప్పుడు.. కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. ఐటీని వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు తనపై యుద్ధమే చేశారని అనేక సందర్భాల్లో చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయినా.. ఆయన ముందుకు సాగారు. ఇక, సెల్ ఫోన్లు, కంప్యూటర్లను డెవలప్ చేసినప్పుడుకూడా ఆయనను వ్యతిరేకించారు.కానీ, ఇప్పుడు అవే హైదరాబాద్కు వెన్నుదన్నుగా మారాయి.
అంటే.. చంద్రబాబు తీసుకున్న, తీసుకునే నిర్ణయాలపై అప్పటికప్పుడు విమర్శలు చేసేవారు కూడా.. తర్వాత కాలంలో వాటినే అనుసరించారు. ఇక, ఇప్పుడు తాజాగా చంద్రబాబు ప్రకటించిన నిర్ణయం “పీ-4”. దీనిపై కూడా మేధావులు విమర్శలు చేస్తున్నారు. అసలు పీ-4 అంటే.. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్- పార్టనర్ షిప్.(నాలుగు ‘పీ’లు). ఈ విధానంలో మౌలిక సదుపాయాలను కల్పించాలన్నది చంద్రబాబు వ్యూహం. దీని ద్వారా రహదారుల నిర్మాణం, గిడ్డంగుల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్స్ వంటివి అందుబాటులోకి వస్తాయి.
ముఖ్యంగా రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రచారం కూడా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పాటి రహదారులు కూడా దెబ్బతిన్న కారణంగా.. జగన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దీంతో చంద్రబాబు వస్తే.. రోడ్లు బాగవుతాయని అందరూ భావించారు. దీంతో మెజారిటీ తటస్థ ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు పీ-4 మంత్రాన్ని జపిస్తున్నారు. దీనిద్వారా కేంద్రం నుంచి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రూపంలో నిధులు తెచ్చుకుంటారు. వీటిని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు.
రాష్ట్ర ప్రబుత్వం కూడా పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఫలితంగా రహదారులు నిర్మించేందుకు మార్గం సుగమం అవుతుంది. అయితే.. రహదారి నిర్మాణం చేసిన తర్వాత.. నాలుగు చక్రాల వాహనాల నుంచి భారీ వాహనాల వరకు కూడా.. రాష్ట్ర రహదారులపై ప్రయాణం చేస్తే.. టోల్ చార్జీలు చెల్లించాలి. ఇదే.. పీపుల్స్ పార్టనర్ షిప్. దీనిని కొందరు వ్యతిరేకిస్తున్నారు. కానీ.. సర్కారు దగ్గర సొమ్ములు లేనప్పుడు.. ఈ మేరకు చేయడం తప్పుకాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న ఫార్ములానే ఇది. సో.. ముందు దీనిని వ్యతిరేకించినా.. తర్వాత మంచిదన్న అభిప్రాయం ఖచ్చితంగా ఏర్పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.