‘జగన్ వ్యక్తిగత కోపాన్ని తీర్చుకుంటున్నాడు’

రాష్ట్రంలోని దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక చీకటి అజెండా అమలవుతోందా ? ఏమో చంద్రబాబునాయుడు చేసిన తాజా ఆరోపణలు సంచలనంగా మారాయి. శ్రీకాకుళం జిల్లా నేతలతో జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయాలపై ఓ అజెండా ప్రకారమే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ మండిపోయారు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి ఎవరిపైనో కోపముంటే… దానికోసం వ్యవస్ధలను నిర్వీర్యం చేయటం, ఆలయాలపై దాడులు చేయటం సరికాదంటు హితవుపలికారు.

కింజారపు యర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజుపై వ్యక్తిగత కోపాన్ని జగన్ ఇపుడు తీర్చుకుంటున్నట్లు చంద్రబాబు విమర్శలు చేశారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అప్పట్లో యర్రన్నాయుడు, అశోక్ లు కూడా ఇంప్లీడ్ అయ్యారన్న కోపంతోనే ఇపుడు అచ్చెన్నాయుడును జైలుకు పంపినట్లు చెప్పారు. అలాగే అశోక్ ను మన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా తీసేసినట్లు చంద్రబాబు ధ్వజమెత్తారు. సింహాచలం దేవాలయంపై మొదలైన జగన్ దాడి చివరకు తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంకు చేరుకుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఇదే సందర్భంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల్లాగే ఇతర మతస్తుల ప్రార్ధనా మందిరాలపైన కూడా దాడులు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సుంటుందని చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. అన్యమతస్తుల ప్రార్ధనా మందిరాలపై దాడులతో భక్తల మనోభావాలు దెబ్బతింటున్నట్లు మండిపోయారు. జగన్ ఇచ్చిన అలుసుతోనే మంత్రులు, నేతలు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ జనాలను రెచ్చగొడుతున్నారంటూ చంద్రబాబు చేసిన కామెంట్లను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిందే. మంత్రుల నోటికి వెంటనే తాళం వేస్తేనే మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

మరి చంద్రబాబు చేసిన ఆరోపణలు, విమర్శలను ఉత్త ఆరోపణలు, విమర్శలుగా కొట్టిపారేయకుండా జాగ్రత్తగా పరిశీలిస్తే బాగానే ఉంటుంది. ప్రతిపక్షాలను కేవలం ప్రతిపక్షాలుగా చూడకుండా వాళ్ళ సీనియారిటిని గౌరవించి సద్విమర్శలుగా తీసుకోవాలి. అప్పుడే దారితప్పుతున్న వ్యవస్ధలను గాడిలో పెట్టటానికి వీలౌతుందన్న వాస్తవాన్ని జగన్ గుర్తించాలి.