తాజాగా రాజ్యసభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 12 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిపికేషన్ ఇచ్చింది. దీనిలో తెలంగాణకు చెందిన కే. కేశవరావు(కేకే) కూడా ఉన్నారు.
అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులు కూడా ఉన్నారు. కేకే మినహా మిగిలిన 11 మంది కూడా.. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. దీంతో ఆయా సీట్లు ఖాళీ అయ్యాయి. వీటిలో కాంగ్రెస్, బీజేపీ, బీజేడీ(ఒడిశా) సహా పలు పార్టీల నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో 9 రాష్ట్రాలకు చెందిన ఈ 12 స్థానాలకు కూడా సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఇవీ ఖాళీ అయిన సీట్లు
కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద్ సోనోవాల్, జ్యోతిరాదిత్య సిందియాలు.. లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతకు ముందు వీరు రాజ్యసభ సభ్యులు. తెలంగాణకు చెందిన కేకే.. బీఆర్ ఎస్ నుంచి సొంత గూడు కాంగ్రెస్‌లోకి వచ్చారు.
ఒడిశాలోని బీజేడీకి చెందిన మమతా మోహంతా ఆ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలోకి చేరారు. దీంతో ఈ సీటు ఖాళీ అయింది. అదేవిధంగా లోక్‌సభకు ఎన్నికైన వారిలో కామాఖ్య ప్రసాద్(బీజేపీ, మిశా భారతి(ఆర్జేడీ) వివేక్ ఠాకూర్(బీజేపీ, దీపేందర్ సింగ్ హుడా(కాంగ్రెస్, ఉదయన్‌రాజే భోస్లే(బీజేపీ, కేసీ వేణుగోపాల్(కాంగ్రెస్, బిప్లవ్ కుమార్ దేవ్(బీజేపీ) ఉన్నారు.
ఆయా స్థానాలకు ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. 21న నామినేషన్లను తీసుకుంటారు. ఈ క్రమంలో సెప్టెంబరు 3న ప్రత్యేక ఎన్నికలు నిర్వహించి.. అదే రోజు ఫలితాన్ని వెల్లడిస్తారు. ఇక, కేకే విషయాన్ని తీసుకుంటే.. ఆయన స్థానాన్ని వేరేవారికి ఇచ్చే ఉద్దేశం లేదు. ఈ నేపథ్యంలో తిరిగి కేకేనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు బలం ఉన్న నేపథ్యంలో ఆయన గెలుపు నల్లేరుపై నడకే కానుందని అంటున్నారు పరిశీలకులు.