కొన్ని రాజకీయ పార్టీలను, కొంతమంది నాయకులను గమనిస్తే అధికారం పోయిన తర్వాత అనేక విషయాలు గుర్తుకొస్తున్న విషయం ఆసక్తిగా మారింది. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తి వంటి విషయాలను పదేపదే మాట్లాడుతున్నారు. అటు ఏపీ, ఇటు తెలంగాణ ఏది తీసుకున్నా ప్రతిపక్షంలో ఉన్న మాజీ అధికార పక్షాలు ఇలా మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగాను వింతగా కూడా కనిపిస్తోంది. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిని చూస్తే అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు అనేది చర్చనీయాంశం.
ఇక, ఇప్పుడు తెలంగాణలో శాంతి భద్రతలు లేవంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు శాంతిభద్రతలు బాగుండి ఉంటే ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తలెత్తిన విద్యార్థులు ఆందోళన కావచ్చు, ఖమ్మం లో వెలుగు చూసిన దళితుల ఆందోళన కావచ్చు.. పోలీసులు విఫలం అయ్యరా? సఫలమయ్యారా? అనేది కేటీఆర్ ఆలోచించుకోవాలి. అదే సమయంలో తమ పాలన అద్భుతంగా ఉందని చెబుతున్న కేటీఆర్ ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేశారు? దళిత బంధు నుంచి డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ల ను ఎంతమందికే ఇచ్చారు అనేది ఆయనే ఆలోచించుకుంటే బాగుంటుంది.
ఎందుకంటే రెండు సార్లు కూడా అధికారంలో ఉండి చెప్పిన హామీల్లో సగం మాత్రమే పూర్తి చేసిన విషయం అందరికీ తెలుసు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. దళిత బందును కేవలం కొన్ని నియోజక వర్గాలకే పరిమితం చేయటం ద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపించారు. ఇక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లే అధికారం నుంచి పార్టీని దిగబట్టేసాయి అనేది అందరికీ తెలిసిందే. అయినా కూడా ఇప్పుడు అధికారం పోయేసరికి ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయడం లేదు అని చెప్పడం ప్రతిపక్షంగా బాగుంటుందేమో కానీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి చేసిన పనులను వెనక్కి ఆలోచించుకోకుండా ఇలాంటి విమర్శలు చేయడం మాత్రం ప్రతి విమర్శలకు దారి తీస్తాయి.
ఇక ఏపీ విషయానికి వస్తే చంద్రబాబును 53 రోజులపాటు జైల్లో ఉంచి కనీస వైద్య సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వకుండా వేదించారు అనేది అప్పట్లో టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు. వీటిపై కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుని ఏసీ వంటివాటిని పెట్టుకున్నారు. అదే సమయంలో నారా లోకేష్ ఢిల్లీ స్థాయిలో తన తండ్రిని అరెస్టు చేసి ఇబ్బంది పెడుతున్నారని ప్రాణాలకు భయంగా ఉందని ప్రాణ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
అప్పట్లో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైసిపి నాయకులు, మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడారు. జైల్లో ఉన్నవాళ్ళకి ప్రాణ రక్షణ ఎందుకు అని, చంద్రబాబు ప్రాణలు ఎవరికి కావాలని ఇట్లా అర్థం పర్థం లేని విధంగా విమర్శలు గుప్పించారు. కానీ, ఇప్పుడు అదే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని తన భద్రతను పెంచాలని కోరుతూ హైకోర్టుకి ఎక్కారు. వాస్తవానికి 139 మంది పోలీసులు భద్రతగా ఉంటే వీరిలో సగం మందిని ప్రభుత్వం తగ్గించిన మాట వాస్తవం. అంటే దాదాపు 70 మంది దాకా ఆయనకి భద్రత గానే ఉన్నారు.
ఇది కాకుండా ఆయనకి ప్రవేట్ సైన్యం కూడా ఉంది. దాదాపు 100 మంది ప్రైవేటు సెక్యూరిటీని సొంతంగా పార్టీ నియమించుకుంది. వారంతా ఇటు పార్టీ కార్యాలయంలోనూ వ్యక్తిగతంగా జగన్‌కు భద్రత కల్పిస్తున్నారు. ఇవన్నీ ఒక భాగమైతే మరోవైపు వ్యక్తిగతంగా జగన్ ను కలిసేందుకు పార్టీ నాయకులను సైతం తనిఖీ చేయకుండా లోపలికి పంపించే వ్యవస్థ లేదు. ఎవరు వచ్చినా వారిని కచ్చితంగా తనిఖీ చేయడం వారి దగ్గర ఉన్న ఫోన్ సైతం లోపలికి అనుమతించకుండా ఉన్న విషయం తెలిసిందే.
అలాంటిది ఇప్పుడు జగన్ తనకు ప్రాణహాని ఉందని చెప్పడం సరే ఆయన వరకు వ్యక్తిగతంగా బాగానే ఉంటుంది. కానీ గతంలో ఇదే ప్రాణహాని ఉందని చంద్రబాబు చెప్పినప్పుడు గానీ ఆ పార్టీ నాయకులు చెప్పినప్పుడు గానీ వ్యంగ్యంగా స్పందించిన విషయం మర్చిపోతే ఎలా? అనేది ఇప్పుడు సమస్య. ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం పోయాక మరో విదంగా వ్యవహరించడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కామన్ గా మారింది.