పెంచలయ్య మహా ముదురు… ఇన్ని సార్లా?

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి పరకామణిలో వంద గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ దొరికిపోయిన పెంచలయ్య వ్యవహారంలో షాకింగ్ నిజాలు వెలుగు చేశాయి. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య కాంట్రాక్టు ఉద్యోగిగా గడిచిన రెండేళ్లుగా పని చేస్తున్నాడు.

అర్గోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న అతను ఈజీగా డబ్బులు సంపాదించే తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా పరకామణిలో బంగారాన్ని దాచి ఉంచే బంగారు ఆభరణాల్ని తస్కరించే పని షురూ చేశాడు. ఇతగాడి తీరులో సందేహాలు రావటంతో.. విజిలెన్స్ అధికారులు అతడిపై నిఘా పెట్టారు.

జనవరి 11న ఎప్పటిలానే విధుల్లోకి వచ్చిన అతను.. బంగారాన్ని దాచి ఉంచే గదిలో 100 గ్రాముల బిస్కెట్ ను దొంగలించి.. ట్రాలీకి ఉన్న పైపుల్లో దాచి పెట్టాడు. తనిఖీ చేస్తున్న సిబ్బంది అతడి చోర కళను పట్టేయటంతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.

అతడు గతంలో చేసిన చోరీల జాబితా బయటకు వచ్చింది. ఇప్పటివరకు అతను 55 గ్రాముల బంగారు బిస్కెట్లను.. 100 గ్రాముల ఆభరణాల్ని.. 157 గ్రాముల వెండి వస్తువుల్ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు అతను చోరీ చేసిన ఆభరణాల విలువ రూ.46 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.

ఇంతకాలంగా పెంచలయ్య చోరీ చేస్తున్నా.. గుర్తించాల్సిన వ్యవస్థలు నిద్రపోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్నగా మారింది.