ఇండియా క్రేజీ మల్టీస్టారర్స్ లో ఒకటిగా చెప్పుకుంటున్న వార్ 2 విడుదల ఇంకో ఎనిమిది నెలల్లో జరగనుంది. ఆగస్ట్ 14 తేదీని ఇంతకు ముందే ప్రకటించడంతో దానికి అనుగుణంగా షూటింగ్ వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇంకొంచెం ప్యాచ్ వర్క్, సాంగ్ తప్ప దాదాపు అయిపోయినట్టేనని బాలీవుడ్ టాక్.
ఇదిలా ఉండగా తారక్, హృతిక్ కాంబోలో ఇందులో ఒక పాట ఉంది. అది కూడా డాన్స్ నెంబర్. ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్ దాకా తీసుకెళ్లిన నాటు నాటు స్థాయిని మించి కంపోజ్ చేస్తున్నారని గతంలోనే లీక్స్ వచ్చాయి. అయితే అది ఎంత ఛాలెంజింగ్ గా ఉంటుందో హృతిక్ రోషన్ తన మాటల్లోనే వివరించాడు.
హృతిక్ డెబ్యూ మూవీ కహో నా ప్యార్ హై పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనవరి 10 రీ రిలీజ్ చేశారు. అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా అప్పట్లో ఇది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక్క సినిమాకే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు హృతిక్.
అమ్మాయిలు వెర్రెక్కిపోయేలా అభిమానించడం మొదలుపెట్టారు. నిర్మాతలు డేట్ల కోసం క్యూ కట్టారు. ఆడియో క్యాసెట్ల అమ్మకాలతో రికార్డులు బద్దలయ్యాయి. ఇక థియేటర్ల జాతర గురించి చెప్పనక్కర్లేదు. దీని ప్రమోషన్లలో భాగంగా అభిమానులతో నేరుగా జరిపిన చిట్ ఛాట్ లో వార్ 2 గురించి ఒక ముఖ్యమైన కబురు పంచుకున్నాడు.
దాని ప్రకారం ఒక పెద్ద డాన్స్ నెంబర్ కోసం హృతిక్ సిద్ధమవుతున్నాడు. నా కాళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటున్నానని, ఆ పోటీలో నిలిచేందుకు సంసిద్ధమవుతున్నానని చెప్పడం ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
బాలీవుడ్ లోనే బెస్ట్ డాన్సర్ గా చెప్పుకునే హృతిక్ ఇంత మాట అన్నాడంటే కొరియోగ్రఫీ మాములుగా ఉండబోదనే క్లారిటీ వచ్చేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న వార్ 2లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇతర క్యాస్టింగ్ తదితర వివరాలను టీమ్ పూర్తిగా వెల్లడించలేదు. యష్ రాజ్ ఫిలింస్ స్పై యునివర్స్ లో వార్ 2 కీలకం కానుంది. తర్వాతి భాగంలోనూ తారక్ ఉండొచ్చు.