లోకేశ్ బాటలో రేవంత్ అడుగులు

ఏపీలో కూటమి సర్కారు అదికారంలో వచ్చి కేవలం ఆరు నెలలే అవుతోంది. అయితేనేం…విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని వస్తూ సంస్కరణలకు పెద్ద పీట వేస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలోని విద్యా శాఖలో ఇప్పటికే పలు కొత్త సంస్కరణలు అమలు అవుతున్నాయి. మొన్నటిదాకా పాఠశాల స్థాయి వరకే అమలు అయిన మద్యాహ్న భోజన పథకాన్ని లోకేశ్ ఇంటర్ దాకా పొడిగించారు. ఇటీవలే స్వయంగా లోకేశే ఈ పథకాన్ని దగ్గరుండి మరీ ప్రారంభించారు.

లోకేశ్ తీసుకున్న ఈ చర్యపై విద్యావంతుల్లో హర్షం వ్యక్తమైంది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్లను గణనీయంగా తగ్గిస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పట్టణాల్లో కూడా మంచి ఫలితాలనే ఇస్తుందనీ వారు అంచనాలు వేస్తున్నారు. తమ గ్రామాలకు దూరంగా ఉంటున్న జూనియర్ కళాశాలలకు వెళుతున్న సందర్భంగా మధ్యాహ్న భోజనం కోసం పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసిన తర్వాతే లోకేశ్ ఈ పథకానికి రూపకల్పన చేశారు.

ఏపీలో లోకేశ్ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం గురించి తెలుసుకున్న తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారు… తామూ మద్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు అందించే దిశగా ఆలోచన చేసింది. ఈ మేరకు విద్యాశాఖను తన వద్దే అట్టిపెట్టుకున్న సీఎం రేవంత్ ఇటీవలే ఇంటర్ బోర్డు కార్యదర్శితో ఈ పథకం అమలు గురించి చర్చించారు. మద్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ వరకూ పొడిగించే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారట.

ఏపీలో ఈ పథకం పట్ల సానుకూల స్పందనలు వస్తున్న నేపథ్యంలోనే తెలంగాణ సర్కారు ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ పథకం అమలులోకి వస్తే.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 425 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 17 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకం ద్వారా ఇంటర్ విద్యార్థులు శారీరకంగానే కాకుండా మానసికంగానే బలోపేతం అవుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా డ్రాపౌట్లు గణనీయంగా తగ్గుతాయని కూడా చెప్పవచ్చు.