గత పర్యాయం ఏకంగా 151 సీట్లతో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అందుకు ప్రధాన కారణాల్లో కార్యకర్తల కృషి ఒకటి. అదే పార్టీ ఇప్పుడు 11 సీట్లకు పరిమితం అయిందన్నా దాని వెనుక కార్యకర్తలు ఉన్నారని చెప్పుకోవాలి.
అంటే వాళ్లు పనిగట్టుకుని ఓడించారు అని కాదు. కార్యకర్తలను వైసీపీ సరిగా పట్టించుకోవడంతో గత ఎన్నికలకు ముందులా వాళ్లు కసిగా పని చేయలేదని.. ఈ పార్టీతో ఒరిగేది ఏముంది అనే నైరాశ్యం వాళ్లను ఆవహించి సైలెంటుగా ఉండిపోయారనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ హయాంలో పెద్ద నాయకులు బాగుపడ్డారు, తప్ప.. కింది స్థాయి కార్యకర్తలు దారుణంగా దెబ్బ తిన్నారని.. గ్రామీణ స్థాయిలో కాంట్రాక్టులు కూడా లేకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా తయారైందనే చర్చ జరిగింది.
కార్యకర్తలను పట్టించుకోలేదనే చెడ్డ పేరును జగన్ మూటగట్టుకున్నారు. తనను ఎంతో అభిమానించే కార్యకర్తలను గత ఐదేళ్లలో ఎక్కడా కలిసే ప్రయత్నం కూడా చేయకపోవడం, వారికి ఏ రకంగానూ అండగా నిలవకపోవడం వ్యతిరేకతను పెంచింది. అసలు ఆయనకు కార్యకర్తల పట్ల ఆయన ఫీలింగ్ ఏంటి అన్నది వైసీపీ మాజీ నేత, ప్రస్తుతం తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన వసంత కృష్ణప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే టైంలో వివిధ ఫైళ్లు పట్టుకుని ఎమ్మెల్యేలు, మంత్రులు సంతకాల కోసం జగన్‌ను కలిసేవారని.. ఆ టైంలో ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ బిల్స్ కూడా తెచ్చేవారని.. కానీ వాటి విషయంలో జగన్ విముఖత ప్రదర్శించేవారని వసంత వెల్లడించారు.
ఓ సందర్భంలో 30 మంది ఎమ్మెల్యేలు చుట్టూ ఉండగా.. కార్యకర్తల గురించి ఆయనన్న మాట తనను షాక్ గురిచేసిందన్నారు. కార్యకర్తలు దొంగ బిల్లులు పెడతారని చెబుతూ.. అందుకే కదా ఈ ఫైల్స్ తెస్తారు అని ప్రశ్నించిన జగన్ తనకు ఇలాంటివి ఇష్టం ఉండవంటూ వాటిని తిరస్కరించిన విషయాన్ని వసంత గుర్తు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. కార్యకర్తల పట్ల జగన్ ఫీలింగ్ ఇదా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates