ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత.. ప్రపంచ స్థాయి కంపెనీలు ఒక్కొక్కటిగా ఏపీకి వస్తున్నాయి. దీనిలో భాగంగా అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత యూట్యూబ్ సంస్థ.. ఏపీలో అకాడమీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. వాస్తవానికి చంద్రబాబే ఆహ్వానించారు.
దీంతో ఆ సంస్థ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ ఏపీ హెడ్ సంజయ్ గుప్తాలు దీనికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు వారితో వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన ప్రాధాన్యాలను ఆయన వారికి వివరించారు.
స్థానికంగా కొందరు జత కలుస్తారని.. వారితో కలిసి అకాడమీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు వారికి సూచించారు. దీనిలో ప్రధానంగా బీటెక్ చదవిన విద్యార్థులకు, నిరుద్యోగులకు.. కంటెంట్, స్కిల్ డెలవప్‌మెంట్, ఏఐ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వంటి వాటిపై శిక్షణ, పరిశోధనలకు అవకాశం కల్పించాలని చంద్రబాబు తెలిపారు.
అమరావతిలోని నవనగరాల్లో ఒకటైన ‘మీడియా సిటీ’లో యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేయాలని కోరారు. కంటెంట్ రైటర్ల ను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి కల్పించే అవకాశాలను చంద్రబాబు వివరించారు. క్వాలిటీ కంటెంట్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడం ద్వారా.. ఆదాయ మార్గాలు ఉన్న విషయాన్ని తెలిపారు.
అదేవిధంగా వీడియోలు, ఆడియోల రూపకల్పన, క్వాలిటీని మెరుగు పరుస్తూ.. విద్యార్థులకు, నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. గూగుల్ తో అనుసంధానం చేసుకుని.. యూట్యూబ్ అకాడమీ కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ఏపీలో నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఉన్నాయని.. వారిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం కోరారు.
ప్రభుత్వ వైపు నుంచి కూడా అపరమిత సాయం అందుతుందని.. మౌలిక సదుపాయాలు అందిస్తామని తెలిపారు. గూగుల్ పేరెంట్ కంపెనీ అల్ఫా బెట్ సీఈవోగా సుందర్ పిచాయ్ ఉన్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఏపీలో యూట్యూబ్ అకాడమీని ఏర్పాటు చేయడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల నుంచి విద్యార్థులు వస్తారని వివరించారు. దీనికి సీఈవోలు అంగీకరించారు.