పీ-4(పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్ షిప్) పాలసీనే సర్కారు అజెండా అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబా బు చెప్పారు. తాజాగా ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారన్న ఆయన రాష్ట్ర పునర్నిర్మాణాన్ని నిర్దేశించే విధంగా కలెక్టర్ లు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్ళాలన్నారు. జవాబుదారీతనంతో కలెక్టర్లు పని చేయాలని సూచించారు. ప్రజలకు సుపాలన, అభివృద్ధి అందించడంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
పి4 పాలసీ ప్రభుత్వ అజెండా అని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సంపద సృష్టికి, సంక్షేమం అమలుకు వినూత్నంగా ఆలోచించి మావతా ధృక్పథంతో పని చేయాలని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనతో పాటు ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి నెలా 1వ తేదీన ‘పేదల సేవ’లో అనే కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి అధికారి వరకు ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజల కష్టనష్టాలను ప్రత్యక్షంగా చూసి పరిష్కార మార్గం ఆలోచించాలని సూచించారు.
కలెక్టర్ లు ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజల సమస్యలను తమ సమస్యగా భావించి పరిష్కారం చూపాలన్నారు. సులభతర, సమర్థవంతమైన పాలనను అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 2047 వికసిత్ భారత్ పేరుతో ముందుకు వెళుతుందని, రాష్ట్రానికి సంబంధించి అక్టోబర్ 2న దీనికి సంబంధించి డాక్యుమెంటరీ తయారు అవుతుందని తెలిపారు.
రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. దీని వల్ల ఉద్యోగ, ఉపాధి రంగాల్లో గణనీయమైన ప్రగతి కనిపించేలా కృషి చేయాలన్నారు. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అదేసమయంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ.. సూపర్ సిక్స్ అమలుకు చర్య లు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ వీటికి అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని చంద్రబాబు చెప్పారు. అవినీతి, అక్రమాలు లేని సమాజం దిశగా రాష్ట్రాన్ని నడిపించేందుకు కృషి చేయాలని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates