దేశమంతా కరోనా ఒకవైపు.. మరోవైపు బాలీవుడ్ డ్రగ్స్ రచ్చ భారీగా నడుస్తున్న వేళ.. తెలంగాణలో అదనంగా ఎన్నికల వేడి రాజుకుంది. ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి ఎన్నికతో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కు ఎన్నికలతో పాటు.. వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా వచ్చే ఎన్నికలన్నింటిలోనూ విజయం తమ సొంతమయ్యేందుకు వీలుగా టీఆర్ఎస్ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది.
పట్టభద్రుల ఎన్నికలు గతానికి మించి పోటాపోటీగా జరిగే అవకాశం ఉండటం.. పలువురు ప్రముఖులు బరిలోకి దిగుతారన్న అంచనాలు వ్యక్తమవుతున్న వేళ.. ఈ ఎన్నికలో తాము విజయం సాధించాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది. కోదండం మాష్టారు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటు పలువురు ప్రముఖులు ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని భావిస్తున్న తెలంగాణ అధికారపక్షం వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని పార్టీ ఎన్నికల ఇన్ ఛార్జీలతో సమావేశాన్ని నిర్వహించారు. వీరిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఎన్నికకు సంబంధించి పట్టభద్రుల ఓటరు జాబితాలో ఓటర్లను చేర్చేందుకు టీఆర్ఎస్ నేతలంతా పని చేయాలన్నారు.
పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని.. అందులో అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని విడిచిపెట్టకుండా పట్టభద్రుల నియోజకవర్గ ఓటరుగా నమోదు చేయాలన్నారు. తాజా ఓటరు లిస్టు ఆధారంగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో.. ఓటర్ల నమోదు కీలకంగా మారనుంది. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు తమ తమ ఇళ్ల నుంచే పట్టభద్రుల ఓటర్లను చేర్చే కార్యక్రమాల్ని షురూ చేయాలని కేటీఆర్ కోరారు. రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని.. తెలంగాణలో విపక్షాలు దివాళా తీసినట్లుగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒకవేళ.. అలాంటి పరిస్థితే ఉంటే.. ఓటర్ల జాబితాకు ఇంత భారీ కసరత్తు అవసరమే అంటారా కేటీఆర్? మరి.. ఆయన ఇచ్చిన టార్గెట్ ను పార్టీ నేతలు ఏమేరకు పూర్తి చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates