సెంటిమెంటు ఎలా ఉంటుందో.. అది ఏ రూపంలో ఉంటుందో పసిగట్టడం.. రాజకీయ నాయకులకు వెన్న తో పెట్టిన విద్య. అందుకే.. రాజకీయాల్లో ఉన్నన్ని సెంటిమెంట్లు ఎక్కడా ఉండవు. 2019లో జగన్ అధికా రంలోకివచ్చేందుకు సెంటిమెంటే కారణమైంది. ఆయన చేసిన పాదయాత్ర కారణంగానే వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. మరి అలాంటిది కీలకమైన సెంటిమెంటును అంచనా వేయడంలో జగన్ ఎక్కడో తప్పు చేశారనే భావన ఇప్పుడు వ్యక్తమవుతోంది.
అదే.. రాజధాని అమరావతి! ఇప్పుడు ఎందుకీ చర్చ? అనే ప్రశ్న రావొచ్చు. నిశితంగా గమనిస్తే.. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు.. అమరావతి రాజధానిపై ప్రజలకు ఎంత సెంటిమెంటు ఉందో తెలుస్తుంది. టీడీపీ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు వస్తున్నవారిలో కేవలం ఫిర్యాదులు చేసేవారు.. తమ సమస్యలు చెప్పుకొనేవారు మాత్రమే కాదు. అమరావతికి విరాళాలు ఇచ్చేవారు కూడా.. తండోప తండాలుగా ఉండడమే దీనికి కారణం.
ఎంతలా ప్రజలు అమరావతి విషయంలో సెంటిమెంటు ఫీలవుతున్నారంటే.. ప్రభుత్వం పిలుపు ఇవ్వక పోయినా.. సీఎం చంద్రబాబు ఏమీ కోరకపోయినా.. వందల సంఖ్యలో ప్రజలు.. నేరుగా ప్రజాదర్బార్‌కు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. విజయవాడకు చెందిన చాలా మంది తమ ఒంటి పై ఉన్న నగలను విరాళంగా ఇస్తే..ఎక్కడో విజయనగరానికి చెందిన వారు కూడా వచ్చి.. రూ.లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇక, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వారు కూడా.. లక్షల రూపాయల్లో విరాళం ఇస్తున్నారు.
మరికొందరైతే.. తాము దాచుకున్న సొమ్ములు కూడా అమరావతికి ఇస్తున్నారు. ఇదంతా చూస్తే.. అమరావతి రాజధాని విషయంలో ప్రజలకు ఎంత సెంటిమెంటు ఏర్పడిందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ సెంటిమెంటు కారణంగానే జగన్ ప్రకటించిన మూడు రాజధానులకు కూడా.. ప్రజల నుంచి మద్దతు లభించలేదు. పైగా.. కర్నూలు, విజయనగరం నుంచే ప్రజలు అమరావతికి జై కొడుతున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ, ఈ చిన్న సెంటిమెంటును అంచనా వేయడంలోను.. అమరావతిని కొనసాగించడంలోనూ..జగన్ విఫలమయ్యారనేది ఇప్పుడు మరోసారి రుజువు అవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates