మోడీ డబుల్ గేమ్ బయటపెట్టిన షర్మిల

ఏపీ మాజీ సీఎం జగన్ తో పాటు గత వైసీపీ ప్రభుత్వంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బీజేపీతో ఐదేళ్లపాటు అంటకాగిన జగన్ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదని షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీని బిజెపి ఉంచుకుందంటూ పరుష పదజాలంతో సైతం షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రంలోని మోడీ సర్కార్ పై షర్మిల విమర్శలు గుప్పించారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై స్పందించిన షర్మిల…కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విశాఖ ఉక్కుకు నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున్నారా అని షర్మిల ప్రశ్నించారు. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్న చందంగా కేంద్రం తీరు ఉందని షర్మిల దుయ్యబట్టారు. 6000 కోట్ల అప్పుల్లో ఉన్నామని, ఉక్కు తయారీకి ముడి పదార్థాలు లేవని, కొనేందుకు డబ్బులు లేవని, నెల జీతాలు కష్టమే అని యాజమాన్యం చేతులెత్తేసినా సరే మోడీకి కనీసం చీమకుట్టినట్లు కూడా లేదని షర్మిల విమర్శించారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, కానీ, విశాఖ ఉక్కుపై మోడీ డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ కు రూపాయి సాయం చేయకుండా వెంటిలేటర్ మీదకి నెట్టారని, నిధులు ఇవ్వకుండా నిశ్శబ్దంగా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నమ్మితే వెంటనే ప్లాంట్ కు సహాయం అందించేలా ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమకు కావలసిన ముడి పదాలు సమకూర్చాలని కోరారు.