ప్రభుత్వం ప్లాగ్ షిప్ గా తీసుకున్న కార్యక్రమాన్ని ఎంత భారీగా చేపడుతుందో.. అందుకు రెట్టింపు ప్రచారాన్ని కోరుకోవటం మామూలే. ఇందుకు మీడియాలో ఫుల్ పేజీ ప్రకటనలు మొదలుకొని.. కవరేజ్ కోసం ప్రత్యేకంగా విన్నపాలు ఇస్తుంటారు. ఇవి సరిపోనట్లుగా.. తాము చేపట్టే కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యేలా చేయటం.. జనసమీకరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయటం.. అందుకు లక్షలాది రూపాయిల్ని ఖర్చు చేయటం చూస్తుంటాం. అందుకు భిన్నంగా చేయాల్సిన పనిని చేసుకుంటూ పోవటం.. ప్రచార ఆర్భాటాలకు పోకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త కల్చర్ ను ఏపీకి తీసుకొస్తున్నారు.
దేశంలోని మరే రాష్ట్రాల్లో లేనట్లుగా ప్రభుత్వ కార్యక్రమాలకు.. చేపట్టే సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున ప్రచారం చేసుకునే విషయంలో తెలుగు రాష్ట్రాలు ముందు ఉంటాయన్న పేరుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. తాను అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసే సంక్షేమ పథకాల విషయంలో లోటుపాట్లు చోటు చేసుకుంటాయన్న చెడ్డపేరును ఈసారి పూర్తిగా పోగొట్టేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చంద్రబాబు. ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని నెల మొదటి రోజునే పూర్తి చేయటం.. దానికి సంబంధించిన గణాంకాల్ని ప్రముఖంగా ప్రకటించటం లాంటివి చేస్తున్నారు.
అదే సమయంలో తాను కూడా ఏదో ఒక ప్రాంతంలో సదరు కార్యక్రమంలో పాల్గొనటం చూస్తున్నాం. ఈ ఆగస్టు మొదటి తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర (శ్రీ సత్యసాయి జిల్లా)కు చంద్రబాబు వెళ్లారు. అక్కడి గుండుమల గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫించన్ల పంపిణీని చేపట్టారు. సాధారణంగా.. ఇలాంటి కార్యక్రమాల్ని భారీగా ఏర్పాటు చేయటం.. వేలాది మందిని సభకు రప్పించటం.. ఆ బల ప్రదర్శనను టీవీ ఛానళ్లలో.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయటం.. ఇక.. గంభీరమైన ప్రసంగాలు ఇస్తూ ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం చేస్తుంటారు.
వీటన్నింటికి భిన్నంగా గ్రామంలోని కొన్ని ప్రాంతాల్ని కాలి నడకన నడవటం.. కొందరికి పింఛన్లను స్వయంగా అందజేయటంతో పాటు.. వారి యోగక్షేమాల గురించి ఆరా తీయటం చేశారు. చిన్న గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎలాంటి బారికేడ్లు లేకుండా.. ప్రజల మధ్యలోకి వెళ్లట.. వారిలో కలుపుగోలుగా మాట్లాడటం చేశారు. అంతేకాదు.. వేరే గ్రామాల నుంచి జన సమీకరణ లాంటివి చేయకుండా సాదాసీదాగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనవసర ఆర్భాటాలకు పోయే కన్నా.. అవసరానికి తగ్గట్లుగా వ్యవహరించి అందరి మనసుల్ని గెలుచుకున్నారు. ఈ తరహా రాజకీయమే ఏపీకి అవసరమన్న మాట వినిపిస్తోంది. వాపు కన్నా బలుపు ముఖ్యం. భారీగా జనాల్ని తీసుకొచ్చి హడావుడి చేసే కన్నా.. జనం మధ్యలో ఉంటూ వారి మనసుల్ని దోచుకోవటమే బెటర్ అన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా కొత్త తరహాలో సీఎం చంద్రబాబు ముందుకు వెళుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.