గన్నవరం టీడీపీ కార్యాలయం పై వల్లభనేని వంశీ ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కేసులో వల్లభనేని వంశీనీ పోలీసులు అరెస్టు చేశారని ప్రచారం జరిగింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్న వంశీ కారును పోలీసులు వెంబడించి ఆయనను అదుపులోకి తీసుకున్నారని పలు మీడియా చానెళ్లలో వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఆ ప్రచారంపై పోలీసులు క్లారిటీనిచ్చారు. వంశీని అరెస్టు చేయలేదని వారు చెప్పారు. అయితే, వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరో అనుచరుడు రమేశ్ ను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా వంశీ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. వంశీ అరెస్ట్ ను అఫీషియల్ గా ప్రకటిస్తే అవాంఛనీయ ఘటనలు, గొడవలు అవకాశం ఉందన్న నేపథ్యంలోనే పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని తెలుస్తోంది.
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తించారని ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్నామన్న అహంకారంతో టిడిపి కార్యాలయం ధ్వంసం కేసు మాత్రమే కాకుండా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లపై కూడా గతంలో వల్లభనేని వంశీ నోరు పారేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఇక, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై కూడా వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ రావడం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates