2019 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది నెలలకే వైసీపీ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ తో రఘురామకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ క్రమంలోనే జగన్ తో పాటు వైసీపీ నేతలపై రఘురామకృష్ణరాజు గత నాలుగున్నరేళ్లుగా సంచలన విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక, తాజాగా జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉండి నియోజకవర్గం నుంచి రఘురామ గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు.
అయితే, గతంలో తమపై విమర్శలు చేశారన్న కారణంతో రఘురామను టార్గెట్ చేస్తూ ఆయన వ్యాపారాలను దెబ్బకొట్టేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ క్రమంలోనే రఘురామకు చెందిన ఇంద్ భారత్ పవర్ లిమిటెడ్ కంపెనీ దివాలా ప్రక్రియకు సంబంధించిన ఆయన బ్యాంకు ఖాతా మోసపూరితమైనదని ఎస్బిఐ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఎస్బిఐ జారీ చేసిన ప్రొసీడింగ్స్ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాకుండా, ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ లకు హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్ విచారణను ఆగస్టు 28కి హైకోర్టు వాయిదా వేసింది. దాంతోపాటు ఆ కంపెనీ డైరెక్టర్ సీతారామంపై కూడా ఎస్బీఐ ప్రొసీడింగ్స్ ను నిలిపివేసేలాగా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates