కొందరు రాజకీయ నేతలను చూస్తే.. వారి వ్యాఖ్యలను గమనిస్తే.. చాలా చిత్రంగా ఉంటుంది. గతంలో వైసీపీ నాయకులు చిత్రమైన వ్యాఖ్యలు చేశారని.. పెద్ద ఎత్తున ప్రజలు చర్చించుకున్నారు. రైతులను ‘ఎర్రిపప్ప’లంటూ ఓ మంత్రి వర్యులు(పేరు చెబితే ఇంకా ఎందుకు వెంటపడతారని బాధపడతారు) వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మరొకరు న్యూడ్ యాంగిల్స్‌లో సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఇవన్నీ అయిపోయాయిలే.. ఇప్పుడు బాగుంటుందిలే! అని అనుకున్నారు.
కానీ, రాజకీయాలు.. నాయకులు.. ఇప్పుడు కూడా చిత్రంగానే అనిపిస్తున్నారు. కనిపిస్తున్నారు. తాజాగా ఓ ఉన్నత విద్యను అభ్యసించిన నాయకుడు, టీడీపీ ఎమ్మెల్యే ఏసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుం డా.. సోషల్ మీడియాలోనూ దుమ్మురేపుతున్నాయి. అధికారంలోకి వచ్చాం.. రాష్ట్రంలో పేకాట క్లబ్బులు తెరిపించే ప్రయత్నం చేస్తా
అని సదరు ఎమ్మెల్యే అనడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.అసలే సరైన ఫీడ్ లేక.. సోషల్ మీడియా ఇటీవల కాలంలో గొంతెండిపోయిందేమో.. ఈ వ్యాఖ్యలను జోరుగా వైరల్ చేస్తోంది.
ఆయనే అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున విజయం దక్కించుకున్న నాయకు డు దగ్గుబాటి వెంకశ్వర ప్రసాద్. ఈయన ఉన్నతోద్యోగి కూడా. రాజకీయాల్లోకి వచ్చి.. తొలిసారే విజయం అందుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు. దీనికి సంబంధించి తనపై ఒత్తిడి కూడా వస్తోందని చెప్పారు.
అక్కడితో ఆగితే.. పోనీలే ఆయన బాధ ఆయనది ఒత్తిడి వస్తున్నప్పుడు.. ఏం చేస్తాంలే! అని సరిపుచ్చుకు నే వారం. కానీ.. గతంలో గురజాడ వారు కన్యాశుల్కంలో చెప్పినట్టుగా.. పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్
అన్నట్టు.. దగ్గుబాటి పేకాటకు నీతి సూత్రం ప్రవచించారు. అదే.. పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవిత కాలం తగ్గిపోయిందని సైన్టిస్టులు చెప్పారు
అని బాంబు పేల్చారు.
అంతేకాదు.. సాధ్యమైనంత వేగంగా.. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి.. రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బులు తెరిపించే ప్రయత్నం చేస్తానన్నారు. చాలా మంచి నిర్ణయం అనాలా? లేక.. ఎలానూ నీరులేక, సాగులేక.. అల్లాడుతున్న అనంతపురంలో ఇక, ప్రజలు చేసేందుకు ఎలానూ పనులు లేవు కాబట్టి.. ఇలా ఉపాధి చూపించారని అనాలా? అని సోషల్ మీడియా జనాలు ఆడేసుకుంటున్నారు.