సీత‌క్కా మ‌జాకా.. స‌భ‌లో మార్కులు కొట్టేశారుగా !

తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కురాలు, ఫైర్ బ్రాండ్ మంత్రి సీత‌క్క త‌న విశ్వ‌రూపం చూపించారు. తాజాగా జ‌రుగుతున్న తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఆమె వ‌రుస‌గా రెండో రోజు కూడా.. టాక్ ఆఫ్ ది సెష‌న్‌గా నిలిచారు. తొలుత బుధ‌వారం స‌భ ప్రారంభం కాగానే మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అధికారం కోసం.. హామీలు ఇచ్చింది ఎవ‌రు? వాటిని 100 రోజుల్లోనే అమ‌లు చేస్తామ‌ని చెప్పిందెవ‌రు? అంటూ ప్ర‌వ్నించారు. సన్నాసులు గ్రూప్ టూ వాయిదా వేయమంటున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలో జోక్యం చేసుకున్న మంత్రి సీత‌క్క‌.. కేటీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. తాము చెప్పిన హామీల‌ను తూచ త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తున్నామ‌ని.. ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు సంతృప్తిగానే ఉన్నార‌ని.. ప్ర‌తిప‌క్షాలే సంతృప్తిగా లేవ‌ని విమ‌ర్శించారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఓర్పుగా ఉండాల‌ని సూచించారు. ఈ స‌మ‌యంలోనే పదేళ్ల పాటు ఓయూకు వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారని సీతక్క దుయ్య‌బ‌ట్టారు.

ప‌దేళ్ల‌పాటు బీఆర్ ఎస్ అధికారంలో ఉండి కూడా.. ఎందుకు నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌లేక పోయింద‌ని సీతక్క ప్ర‌వ్నించారు. ఆశా వ‌ర్క‌ర్ల ఉద్య‌మాన్ని ప్ర‌శ్నిస్తున్న‌వారు..వారి కుటుంబాల్లోని ముస‌లివారికి.. పింఛ‌న్లు ఎందుకు తీసేశార‌ని నిప్పులు చెరిగారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారి కుటుంబాల‌లోని తల్లిదండ్రుల పింఛన్‌ను కూడా తీసేసింది .. మీరు కాదా? అని కేటీఆర్ ను ఉద్దేశించి ప్ర‌శ్న‌లు గుప్పించారు. ధరణి పేరుతో పెద్ద కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌నిచెప్పుకొనే వారు.. క‌నీసం పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని అన్నారు.

దీంతో ప‌దే ప‌దే కేటీఆర్ మంత్రి సీత‌క్క ప్ర‌సంగానికి అడ్డుత‌గిలే ప్ర‌య‌త్నం చేశారు. ఆమె చెబుతున్న లెక్క‌ల‌న్నీ త‌ప్పుల‌ని వ్యాఖ్యానించారు. తమ హ‌యాంలో ఏ ఒక్క‌రి పింఛ‌ను తీసేయ‌లేద‌న్నారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. అయితే.. స్పీక‌ర్ జోక్యం చేసుకుని ఇరువురినీ శాంతింప చేశారు.