వైఎస్ విజయమ్మతో టీడీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్.. జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఉరుములు లేని పిడుగు మాదిరిగా.. జరిగిన ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం జేసీ కుటుంబం టీడీపీలోనే ఉంది. పైగా జేసీ కుమారుడు అస్మిత్‌రెడ్డి టీడీపీ తరఫున విజయం సాధించారు. ఇక, విజయమ్మ తటస్థంగా ఉన్నారనే విషయం తెలిసిందే. అటుకుమారుడు, ఇటు కుమార్తె షర్మిలకు ఆమె తటస్థంగానే వ్యవహరిస్తున్నారు.
ఇలాంటి సమయంలో అనూహ్యంగా జేసీ కలుసుకోవడం.. కేవలం విజయమ్మ ఆరోగ్యం గురించే తాను వాకబు చేసినట్టు చెప్పడం.. గమనార్హం. హైదరాబాద్‌లో ఉంటున్న విజయమ్మను సోమవారం ఉదయమే .. జేసీ కలుసుకున్నారు. ఆమెతో సుమారు గంటకుపైనే చర్చలు జరిపారు. ఊరక రారు.. అన్నట్టుగా విజయమ్మ ఆరోగ్యం కోసమే అయి ఉంటే.. జేసీ ఇప్పటికిప్పుడు పనిగట్టుకుని అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వచ్చేంత సీన్ లేదు. ఇది స్పష్టం.
అయితే.. జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి సతీమణికి, విజయమ్మ కుటుంబానికి బంధుత్వం ఉంది. అందుకే.. ఆమెను పలకరించేందుకు వచ్చారని జేసీ వర్గం ప్రచారం చేస్తోంది. అయితే… వైఎస్ ఉన్నంతకాలం జేసీలు కాంగ్రెస్ లోనే ఉన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోయినా మారలేదు. జగన్ తో చెడినా… విజయమ్మతో అప్పటి పరిచయం అలాగే ఉన్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉండొచ్చు.