విశాఖ గ్రేట‌ర్ పీఠంపై జ‌న‌సేన క‌న్ను!

గ్రేట‌ర్ విశాఖ ప‌ట్నం కార్పొరేష‌న్ పీఠంపై జ‌న‌సేన క‌న్నేసిన‌ట్టు తెలిస్తోంది. ప్ర‌స్తుతం విశాఖ‌, శ్రీకాకుళం, స‌హా.. అనంత‌పురం, చిత్తూరుపై జ‌న‌సేన ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ ప్రారంభించింది. ఇక‌, ఇప్పుడు విశాఖ గ్రేట‌ర్ పీఠాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. విష‌యంలోకి వెళ్తే.. విశాఖ కార్పొరేష‌న్‌ను గ‌త 2021లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ ద‌క్కించుకుంది. విజ‌య‌సాయిరెడ్డి ఏకంగా పాద‌యాత్ర చేసి మ‌రీ.. ఇక్క‌డ పార్టీని నిల‌బెట్టారు. అదేవిధంగా స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కేలా వ్యూహాలు వేశారు. విజ‌యం సాధించారు.

అయితే.. విశాఖ‌లో ఇప్పుడు వైసీపీ చాలా బ‌ల‌హీన ప‌డింది. దీంతో నాయ‌కులు కూడా పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే.. గ్రేట‌ర్ పీఠాన్ని ద‌క్కించుకుంటే..జ‌న‌సేన బ‌లప‌డేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని క్షేత్ర‌స్థాయిలో కొంద‌రు వైసీపీ నుంచి జ‌న‌సేన‌లోకి ఇప్ప‌టికే వ‌చ్చిన నాయ‌కులు చెబుతున్నారు. వాస్త‌వానికి వైసీపీ నుంచి టీడీపీలోకి రావాల‌ని కొందరు ప్ర‌య‌త్నించారు. కానీ, వారిని స్థానికంగా కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న నాయ‌కులు అడ్డుకుంటున్నారు. దీంతో వారంతా జ‌న‌సేన వైపు చూస్తున్నారు. వీరిని చేర్చుకునేందుకు జ‌న‌సేన సిద్ధంగానే ఉంది.

ముఖ్యంగా గ్రేట‌ర్ పీఠాన్ని ద‌క్కించుకుంటే.. త‌మ‌కు మ‌రింత వెసులుబాటు వ‌స్తుంద‌ని పార్టీ కీల‌క నాయ‌కులు చెబుతున్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీలో చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయాల్సి ఉన్న నేప‌థ్యంలో కొంత వెనుకంజ వేస్తున్నారు. ఇదిలావుంటే.. ఇప్ప‌టికే 20 మంది కార్పొరేట‌ర్లు వైసీపీకి దూర‌మ‌య్యారు. మ‌రో 9 మంది వ‌ర‌కు పార్టీ మారుతామ‌ని బాహాటంగానే చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌ను నిలువ‌రించేందుకు పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఉత్త‌రాంధ్ర వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పెద్ద‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు. మ‌రో వైపు జిల్లాకే చెందిన మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ కూడా.. నిలువ‌రించేందుకు ప్ర‌య‌త్నించ‌డం లేదు. దీంతో వైసీపీ ఖాళీ కావ‌డం.. గ్రేట‌ర్ పీఠంపై జ‌న‌సేన జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ సాగుతోంది.