‘ఒక‌టి’ గండం తీరేనా? బాబు స‌ర్కారుకు పెను స‌వాల్!

ఏపీలో ప్ర‌భుత్వానికి ప్ర‌తి నెలా 1వ తేదీ అంటేనే కొంత త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మూడు ప‌ద్దుల‌ను ఒకే రోజు చెల్లించాల్సి రావ‌డం.. నిధుల ప‌రిస్థితి చూస్తే ఆశించిన విధంగా లేక‌పోవ‌డంతో గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వం.. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం కూడా ప్ర‌తి నెలా 1వ తేదీ అంటే.. ఒక పెద్ద ‘గండం’గా భావిస్తున్నాయి. సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్లు, ఉద్యోగుల‌కు వేత‌నాలు, రిటైర్డ్ ఉద్యోగుల‌కు పింఛ‌న్లు.. ఈ మూడు ప‌ద్దుల‌ను 1వ తేదీనే ఇవ్వాల్సి ఉండ‌డం స‌ర్కారుకు త‌ల‌కుమించిన భారంగా మారింది. గతంలో జ‌గ‌న్ హ‌యాంలో ముందు సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌కు సొమ్ములు ఇచ్చేవారు.

త‌ర్వాత‌.. ఉద్యోగుల‌కు, రిటైర్డ్ ఉద్యోగుల‌కు సొమ్ములు ఇచ్చేవారు. దీంతో ఇవి చాలా రోజులు ఆల‌స్యం కావ‌డంతో వివాదాల‌కు దారితీసింది. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఆందోళ‌న‌కు దిగిన సంద‌ర్భాలున్నాయి. మొత్తంగా ఇది ఎన్నికల‌వేళ వ్య‌తిరేక‌త‌కు దారితీసి.. వైసీపీ ఘోరంగా ఓడిపోయే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చింది. ఇక‌, కూట‌మి స‌ర్కారుకు కూడా.. ఈ గండం త‌ప్ప‌డం లేదు. పైగా.. గ‌త వైసీపీ స‌ర్కారు రూ.3000 చొప్పున సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను ఇస్తే.. ఇప్పుడు కూట‌మి స‌ర్కారు రూ.4000 చొప్పున ఇవ్వాల్సి వ‌స్తోంది. తొలినెల‌లో ఈ గండం నుంచి బ‌య‌ట ప‌డేందుకు రూ.7-9 వేల కోట్లు అప్పు చేశారు.

ఇక‌, మ‌రో మూడు, నాలుగు రోజుల్లో 1వ తేదీ రానుంది. ఇప్పుడు కూడా సుమారు 4 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైబ‌డి సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌కు చెల్లించాల్సి ఉంది. సాధార‌ణ పింఛ‌న్ల‌ను రూ.4 వేల చొప్పు, దివ్యాంగ పింఛ‌ను రూ.6 వేల చొప్పు, ఇత‌ర వ్యాధిగ్ర‌స్థుల‌కు రూ.10 వేలు, రూ.15 వేల‌చొప్పున కూడా చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ మేర‌కు నిధుల అవ‌స‌రం ఏర్ప‌డింది. అదేస‌మ‌యంలో ఉద్యోగుల‌కు చెల్లించాల్సిన వేత‌నాలు, రిటైర్డ్ ఉద్యోగుల‌కు ఇవ్వాల్స‌ని పింఛ‌న్లు కూడా.. స‌ర్కారు 1నే ఇస్తుందా? లేక‌.. వాయిదా వేస్తుందా? అనేది తేల‌లేదు.

ప్ర‌స్తుతం ఖ‌జానాలో మాత్రం సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌కు స‌రిపోయేలా మాత్ర‌మే నిధులు ఉన్నాయి. ఉద్యోగుల‌కు జీత భ‌త్యాల వ్య‌వ‌హారం మాత్రం పెండింగులోనే ఉంది. అయితే.. రేపు వ‌చ్చే మంగ‌ళ‌వారం(30 జూలై) నాడు ఆర్బీఐ నిర్వ‌హించే వేలంలో పాల్గొని సెక్యూరిటీ డిపాజిట్ల వేలం ద్వారా 4 వేల కోట్లు స‌మీక‌రించేందుకు కూట‌మి స‌ర్కారు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ నిధులు వ‌స్తే.. ప్ర‌భుత్వానికి 1వ తేదీ గండం తీరుతుంద‌ని అధికారులు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం.